శోభన్‌బాబుకు సిగరెట్లు, మందు తాగే అలవాటు ఉండేదా?
on Sep 26, 2020

నటభూషణ్ అని అభిమానులు పిలుచుకొనే శోభన్‌బాబుకు జీవితంపై నిశ్చితాభిప్రాయాలుండేవి. అందాల నటుడిగా మహిళా ప్రేక్షకుల్లో అమితమైన ఆదరాన్ని సంపాదించుకున్న ఆయనకు పట్టుదల ఎక్కువ. అలవాట్ల విషయంలోనూ, జీవనశైలి విషయంలోనూ ఆయన నిక్కచ్చిగా ఉండేవారు. సాధారణంగా సినీ రంగంలో ఉండేవారికి ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటాయి. కానీ ఆయన వాటిని దరి చేరనీయలేదు. ప్రమాదవశాత్తూ ఇంట్లో కిందపడి చనిపోయే ముందు వరకూ ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. తన అలవాట్లే తనకు ఆ ఆరోగ్యాన్నిచ్చాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
"ఏ అలవాటైనా మితంగా ఉండాలనేది నా అభిప్రాయం. కాఫీ తాగడంలో తప్పులేదు. ఉదయం, సాయంత్రం ఓ కప్పు తాగితే ఓకే. కానీ అదేపనిగా కాఫీ తాగడం మంచిది కాదు. ఈమధ్య టీ చాలా మంచిదంటున్నారు. కాబట్టి పొద్దునొక గంగాళం, సాయంత్రం ఒక గంగాళం తాగితే దానికి అర్థం ఉండదు. ఏదైనా మితి ఉండాలి. చిన్నప్పట్నుంచీ నేను ఆ యాంగిల్‌లో వెళ్లాను." అని చెప్పారు శోభన్.
సినిమాల్లో తప్ప ఆయనెప్పుడూ పొగతాగలేదు. "అలాగే నేనెప్పుడూ మందు తాగను.. ఆఖరుకి షాంపేన్ కూడా. అందులో ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. కొంతమంది హీరోయిన్లు పార్టీల్లో షాంపేన్ తీసుకుంటూ నన్ను కూడా తీసుకొమ్మని ఫోర్స్ చేసేవాళ్లు. ఐ నెవ్వర్ టచ్. నేను కూల్‌డ్రింక్ తెప్పించుకొని తాగేవాడ్ని. వాళ్లు నవ్వుకొనేవాళ్లు. షాంపేన్ తీసుకోనివాళ్లు హాట్ లిక్కర్స్ ఇంకేం తీసుకుంటారు అనేవాళ్లు. దటీజ్ మై వే ఆఫ్ లైఫ్ అని చెప్పి తప్పించుకొనేవాడ్ని." అని ఆయన తెలిపారు.
అయితే ఆయనకు కాఫీ అలవాటు ఉండేది. "నలభై ఐదేళ్ల పాటు పొద్దున్నే ఓ కప్పు కాఫీ తాగడం నాకలవాటుగా ఉండేది. అది కూడా ఇప్పుడు మానేశాను. అది అవసరమా అనిపించింది. ఒకసారి పొద్దున్నే కాఫీ రాలేదు. షూటింగ్ టైమ్ అవుతోందని వెళ్లిపోయాను. రెండో రోజు కూడా ఎందుకనో పాలు రాకనో, ఎందుకో కాఫీ రాలేదు. అప్పుడూ తాగకుండానే షూటింగ్‌కు వెళ్లాను. రెండు రోజులు మానంగా లేనిది, లైఫ్ లాంగ్ ఎందుకు మానలేనని మానేశాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కాఫీ తాగలేదు." అని చెప్పుకొచ్చారు శోభన్‌బాబు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



