'వాలి' రీమేక్ రైట్స్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఎస్.జె. సూర్య!
on Nov 29, 2021

అన్నదమ్ములుగా అజిత్ డబుల్ రోల్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'వాలి' (1999) రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ వచ్చే ఏడాది ఆ మూవీని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. అయితే ఈ వ్యవహారంలో బోనీ కపూర్, ఒరిజినల్ డైరెక్టర్ ఎస్.జె. సూర్య మధ్య మరికొంత కాలం న్యాయపోరాటం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా రీమేక్‌కు సంబంధించిన ఇటీవల చెన్నై కోర్టు నుంచి వచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని సూర్య సన్నిహిత వర్గాలు తెలిపాయి.
డైరెక్టర్‌గా ఎస్.జె. సూర్య కెరీర్‌కు 'వాలి' బిగ్ బ్రేక్ నిచ్చింది. అందుకే ఆ సినిమా అంటే అతనికి చాలా చాలా ఇష్టం. హిందీలో దాన్ని రీమేక్ చేయాలనీ, అజిత్ చేయకపోతే, అందులో తానే నటించాలనీ అతను అనుకుంటున్నాడు. ఈ కారణంతోనే ఆ మూవీని హిందీలో రీమేక్ చేయకుండా బోనీ కపూర్‌ను ఆపాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయినప్పటికీ, హిందీ రీమేక్‌కు సంబంధించిన పనులు మొదలు పెట్టుకోవచ్చంటూ ఇటీవల కోర్టు ఒక ప్రత్యేక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని యస్.జె. సూర్య అనుకుంటున్నాడు.
'అరణ్య కాండమ్' ప్రొడ్యూసర్స్‌కు వ్యతిరేకంగా డైరెక్టర్ త్యాగరాజన్ కుమారరాజా పెట్టిన కేసులో మద్రాస్ హైకోర్టు 2017లో ఇచ్చిన ఉత్తర్వును ఆధారం చేసుకొని, 'వాలి' రీమేక్ హక్కులు తనకే చెందుతాయని సూర్య నమ్ముతున్నాడు. అప్పటి తీర్పులో, 'అరణ్య కాండమ్' డబ్బింగ్ రైట్స్ ప్రొడ్యూసర్‌కు చెందుతాయనీ, రీమేక్ రైట్స్‌ను ప్రొడ్యూసర్‌కే ఇస్తున్నట్లు స్క్రిప్ట్ రైటర్ అగ్రిమెంట్ కుదుర్చుకోకపోతే, ఆ రైట్స్ రైటర్ వద్దే ఉంటాయనీ కోర్టు చెప్పింది. 'వాలి' రైటర్‌ను తానే కాబట్టి, రీమేక్ రైట్స్ తనకే చెందుతాయని యస్.జె. సూర్య నమ్ముతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



