డిస్నీ కేరెక్టర్‌కు వాయిస్ ఇచ్చిన మహేశ్ కుమార్తె!
on Nov 11, 2019
సూపర్‌స్టార్ మహేశ్ కుమారుడు గౌతమ్ '1.. నేనొక్కడినే' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమార్తె సితార సైతం సినిమాల్లోకి అడుగుపెడుతోంది. అయితే నటిగా కాదు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా! అవును. హాలీవుడ్ యానిమేషన్ ఫిల్మ్ 'ఫ్రోజెన్ 2' తెలుగు వెర్షన్లో ప్రధాన పాత్ర 'ఎల్సా'కు ఆమె వాయిస్ ఇచ్చింది. డిస్నీ స్టూడియో నిర్మించగా, సూపర్‌హిట్టయిన 'ఫ్రోజెన్' మూవీకి ఇది సీక్వెల్. నవంబర్ 22న ఈ సినిమా విడుదలవుతోంది. మహేశ్, నమ్రతల ముద్దుల కుమార్తె ఏడేళ్ల సితార ఈ మూవీలో చిన్నప్పటి ఎల్సాకు డబ్బింగ్ చెప్పింది.
ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ "సితారకు 'ఫ్రోజెన్' మూవీ అంటే చాలా ఇష్టం. ఆ సినిమా చూస్తూ పెరిగింది. అందులో ఎల్సా పాత్ర అంటే తనకు మరీ మరీ ఇష్టం. ఆ ఇష్టం వల్ల, యంగ్ ఎల్సాకు వాయిస్ ఇవ్వాలనే ఆఫర్‌ను కాదనడానికి ఎలాంటి కారణమూ కనిపించలేదు. ఈ సినిమాకు ప్రతి అమ్మాయీ కనెక్టవుతుంది. సితార అందుకు మినహాయింపు కాదు. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన డిస్నీ బృందానికి మా థాంక్స్. 'ఫ్రోజెన్ 2' తెలుగు వెర్షన్లో భాగమైనందుకు సితార చాలా హ్యాపీగా ఉంది. అలాగే తన ఫేవరేట్ కేరెక్టర్‌కు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంతగానో ఆస్వాదించింది" అన్నారు.
ఎల్సా, అన్నా అనే ఇద్దరు అమ్మాయిలు చేసే సాహసాలతో సాగే 'ఫ్రోజెన్ 2' సినిమా తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ వెర్షన్లలో దేశవ్యాప్తంగా నవంబర్ 22న రిలీజ్ అవుతోంది. సితార తన వాయిస్‌తో ఎల్సా కేరెక్టర్‌కు ఏ విధంగా జీవం పోసిందో చూడాలి.