సీతారాముల ప్రేమ కథకు ముహూర్తం ఖరారు
on May 25, 2022
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సీతా రామం'. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లెఫ్ట్నెంట్ 'రామ్' గా దుల్కర్ కనిపించనున్నాడు. 'యుద్ధంతో రాసిన ప్రేమ కథ' అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ 'సీత' పాత్రలో నటిస్తుండగా సీతారాములను కలిపే 'అఫ్రీన్' అనే ముస్లిం యువతి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
'మహానటి' సినిమాతో మలయాళ హీరో దుల్కర్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మహానటి నిర్మాతలతోనే 'సీతా రామం' చేస్తున్నాడు. పైగా ఈ సినిమాకి 'అందాల రాక్షసి' ఫేమ్ హను దర్శకత్వం వహించడంతో పాటు, నేషనల్ క్రష్ రష్మిక స్పెషల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.