English | Telugu  
English | Telugu

'సీతారామం' మూవీ రివ్యూ

on Aug 5, 2022

 

సినిమా పేరు: సీతారామం
తారాగ‌ణం: దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకుర్‌, ర‌ష్మికా మంద‌న్న‌, త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం, సుమంత్‌, భూమిక‌, శ‌త్రు, వెన్నెల కిశోర్‌, స‌చిన్ ఖెడేక‌ర్‌, జిషు సేన్‌గుప్తా, గౌత‌మ్ మీన‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, అభిన‌య‌
మ్యూజిక్: విశాల్ చంద్ర‌శేఖ‌ర్
సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌. వినోద్‌
ఎడిటింగ్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సునీల్ బాబు
నిర్మాత: సి. అశ్వినీదత్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: హ‌ను రాఘ‌వ‌పూడి
బ్యాన‌ర్స్: వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమా
విడుద‌ల తేదీ 5 ఆగ‌స్ట్ 2022

దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తోన్న స్ట్ర‌యిట్ సినిమా అవ‌డంతో 'సీతారామం'పై సినీ ప్రియులు ఆశ‌లు పెట్టుకున్నారు. క‌థ బాగా క‌దిలిస్తేనే ఆయ‌న మ‌రో భాష‌లో న‌టించ‌డానికి ఒప్పుకుంటాడ‌నే పేరుండ‌ట‌మే దీనికి కార‌ణం. సినిమాని ఒక పొయిట్రీ లాగా, ఒక పెయింటింగ్ లాగా తీస్తాడ‌నే పేరు తెచ్చుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మ‌రాఠీ, హిందీ సినిమాల తార మృణాల్ ఠాకూర్ నాయిక‌గా న‌టిస్తే, ర‌ష్మికా మంద‌న్న క‌థ‌కు కీల‌క‌మైన ఓ స్పెష‌ల్ రోల్ చేసింది. వైజ‌యంతీ మూవీస్ నుంచి వ‌చ్చిన 'సీతారామం' ఎలా ఉందంటే...

క‌థ‌
క‌శ్మీర్ ప్రాంతంలో బోర్డ‌ర్ ద‌గ్గ‌ర సైన్యంలోని మ‌ద్రాస్ రెజిమెంట్‌లో ప‌నిచేసే లెఫ్టినెంట్ రామ్ (దుల్క‌ర్ స‌ల్మాన్‌) త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి 1964లో ఒక‌సారి క‌శ్మీర్‌లోని ఓ ప్రాతంలోని జ‌నాన్ని మ‌త‌ప‌ర‌మైన మార‌ణ‌హోమం నుంచి కాపాడ‌టంతో అత‌ని పేరు మారుమోగుతుంది. అత‌ను అనాథ అని తెలియ‌డంతో అత‌డికి తామున్నామంటూ వంద‌లాది మంది ఉత్త‌రాలు రాయ‌డం మొద‌లుపెడ‌తారు. వాటిలో మీ భార్య‌ సీతామ‌హాల‌క్ష్మి అంటూ వ‌చ్చిన ఉత్త‌రం అత‌డిని ఆక‌ర్షిస్తుంది. ఫ్ర‌మ్ అడ్ర‌స్ లేకుండా ఉత్త‌రాలు రాస్తున్న ఆమె ఎలా ఉంటుందో, ఆమె ఎవ‌రో తెలీకుండానే ప్రేమ‌లో ప‌డ‌తాడు రామ్‌. సెల‌వు పెట్టి, ఆమెను క‌లుసుకోవ‌డానికి బ‌య‌లుదేరి, ఆమె రాసిన‌ ఉత్త‌రం ఆధారంగా ట్రైన్‌లో ఆమెను క‌లుసుకుంటాడు. కొన్ని రోజుల పాటు ఇద్ద‌రూ క‌లుసుకుంటూ, ఒక‌రి సాంగ‌త్యాన్ని మ‌రొక‌రు ఆస్వాదిస్తారు. రామ్ క‌శ్మీర్‌కు వెళ్లిపోతాడు. వెళ్లేప్పుడు సీత క‌లుస్తుంద‌ని అనుకుంటాడు కానీ ఆమె క‌ల‌వ‌దు. దాంతో అత‌డు క‌ల‌త చెందుతాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? రామ్‌ను సీత క‌లుసుకుందా? అస‌లు సీత ఎవ‌రు? ఆమె వెనకున్న ర‌హ‌స్య‌మేంటి? రామ్ ఏమ‌య్యాడు? అనే విష‌యాలు క‌థాక్ర‌మంలో తెలుసుకుంటాం.

విశ్లేష‌ణ‌
ఈ సినిమా క‌థ‌ను న‌డిపేది ర‌ష్మిక మంద‌న్న‌ పోషించిన ఆఫ్రీన్ క్యారెక్ట‌ర్‌. పాకిస్తానీ ముస్లిం అయిన ఆమె లండ‌న్‌లో చ‌దువుకుంటూ, భార‌త్ అంటే ద్వేషం క‌న‌ప‌రుస్తూ ఉంటుంది. ఆ ప్ర‌భావంలో ఆమె చేసిన ఓ ప‌ని వ‌ల్ల ఇంటికి వెళ్లాల్సి వ‌స్తుంది. అప్ప‌టికే చ‌నిపోయిన ఆమె తాత‌ తారిఖ్ (స‌చిన్ ఖెడేక‌ర్‌) ఆమెకు ఓ ప‌ని అప్ప‌గిస్తాడు. సీత‌కు రామ్ రాసిన ఉత్త‌రాన్ని ఆమెకు చేర్చాల‌నేది ఆ ప‌ని. ఇష్టం లేక‌పోయినా, డ‌బ్బు అవ‌స‌రం కాబ‌ట్టి, దాని కోసం ఉత్త‌రం ప‌ట్టుకొని ప్ర‌ధాన క‌థ జ‌రిగిన 20 ఏళ్ల త‌ర్వాత‌ హైద‌రాబాద్‌కు వ‌చ్చి సీత కోసం అన్వేషించ‌డంతో 'సీతారామం' క‌థ మొద‌లవుతుంది. ఈ ప‌నిలో ఆఫ్రీన్‌కు ఆమె సీనియ‌ర్ బాలాజీ (త‌రుణ్ భాస్క‌ర్‌) తోడుగా ఉంటాడు. వాళ్లు క‌లుసుకొనే ఒక్కో పాత్ర త‌మ‌కు తెలిసినంత‌వ‌ర‌కూ రామ్‌, సీత క‌థ చెప్తూ పోతుంది. వాళ్ల ప్రేమ‌క‌థ మ‌న హృద‌యాల్ని మొద‌ట సుతిమెత్త‌గా స్పృశిస్తూ, స‌మ్మోహ‌న‌ప‌రుస్తూ, చివ‌ర‌కు గాఢ‌మైన ముద్ర వేసేస్తుంది.

సీత, రామ్‌ ప్ర‌ణ‌య‌గాథ నేటి కాల‌పు క‌థ కాదు. ఇది 1960ల నాటి కాలానికి చెందిన క‌థ‌. సీత‌, రామ్ మ‌ధ్య ప్రేమ పెన‌వేసుకొనే స‌న్నివేశాల్ని హ‌ను మ‌ల‌చిన తీరు ప్ర‌శంస‌నీయం. వాళ్ల మ‌ధ్య గాలి కూడా చొర‌బ‌డ‌న‌ట్లు కౌగ‌లించుకోవ‌డాలు ఉండ‌వు, లిప్ కిస్‌లు ఉండ‌వు, తైత‌క్క‌లాడుకోవ‌డాలు ఉండ‌వు. ఆ ఇద్ద‌రి ప్రేమ‌లో కొంత అల్ల‌రి ఉంటుంది, ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకోవ‌డం ఉంటుంది, హుందాత‌నం ఉంటుంది. ఇంట‌ర్వెల్‌లో సీత పాత్ర‌కు సంబంధించిన ట్విస్ట్ మ‌న‌ల్ని అబ్బుర‌ప‌రుస్తుంది. ఆమె వివ‌రాలు తెలుసుకోవ‌డానికి హైద‌రాబాద్ న‌వాబు ఇంట్లోకి వెళ్లిన ఆఫ్రీన్‌, బాలాజీ ఆమె ఎవ‌రో తెలుసుకొని షాక‌వుతారు. అప్పుడే సీత ఎవ‌రో తెలిసి మ‌న‌మూ షాక‌వుతాం. సీత ఎవ‌రో నిజం తెలీని రామ్ క‌శ్మీర్ వెళ్లిపోతే, త‌న‌వాళ్ల‌ను ఎదిరించి రామ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయిన సీత ధైర్యం చూసి ఆశ్చ‌ర్య‌పోతాం. 

రామ్‌, సీత పాత్ర‌ల‌ను, వారి మ‌ధ్య ప్రేమ పెన‌వేసుకొనే స‌న్నివేశాల‌నూ ద‌ర్శ‌కుడు హ‌ను మ‌ల‌చిన తీరు వ‌ల్ల 'సీతారామం'కు క్లాసిక్ లుక్ వ‌చ్చింది. ఇది ఇప్ప‌టివ‌ర‌కూ హ‌ను తీసినవాటిని ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదు. కొంత‌మంది సినిమా నిడివి కాస్త త‌గ్గిస్తే బాగుండేద‌ని ఫీల‌వ‌డం నా దృష్టికి వ‌చ్చింది. కానీ, నాకైతే అలాంటి ఫీలింగ్ క‌ల‌గ‌లేదు. సీత‌, రామ్ మ‌ధ్య పెన‌వేసుకున్న అమ‌లిన ప్రేమ‌క‌థ మ‌న‌ల్ని అందులో లీనం చేసేస్తుంది. ఈ కాలంలో ఇలాంటి క్లాసిక్ ల‌వ్ స్టోరీని ప్రొడ్యూస్ చేయ‌డానికి గ‌ట్స్ ఉండాలి. వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమా ఆ సాహ‌సాన్ని చేశాయి. 

ఈ బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీకి అంతే బ్యూటిఫుల్ సినిమాటోగ్ర‌ఫీ, మ్యూజిక్ ఎస్సెట్‌గా నిలిచాయి. సంద‌ర్భానుసారంగా, స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్లు విశాల్ చంద్ర‌శేఖ‌ర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంతో అందంగా ఉంది. క‌థ‌తో పాటు సంగీత‌మూ ప్ర‌యాణం చేసింది. పాట‌లూ అంతే. ఇక పి.ఎస్‌. వినోద్ సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్‌. సీత‌, రామ్ ప్రేమను ఎంత బాగా, మ‌న‌సును రంజింప‌జేసేలా దృశ్య‌మానం చేశాడో! ట్రైన్‌లో తొలిసారి సీత‌ను రామ్ చూసే సీన్‌లో ఇటు ఛాయాగ్ర‌హ‌ణం, అటు సంగీతం అద్భుతం అంతే! కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న అనుభ‌వాన్నంతా రంగ‌రించి, చ‌క్క‌ని ఎడిటింగ్‌తో 'సీతారామం'ను మ‌న ముందు ఆవిష్కరింప‌జేశారు. సునీల్ బాబు ప్రొడ‌క్ష‌న్ డిజైన్ గురించి కూడా ప్రస్తావించుకోవాలి. 

న‌టీన‌టుల ప‌నితీరు
ఇది దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమా అని చెప్పాలా! లేక మృణాల్ ఠాకూర్ సినిమా అని చెప్పాలా! ఇది ఆ ఇద్ద‌రి సినిమా. సీతామ‌హాల‌క్ష్మిగా మృణాల్ ఠాకూర్‌, రామ్‌గా దుల్క‌ర్ ఆ పాత్ర‌ల‌ను అర్థం చేసుకొని, వాటి మాదిరిగా న‌టించ‌లేదు, వాటి మాదిరిగా ప్ర‌వ‌ర్తించారు. అత్యంత స‌హ‌జ‌మైన అభిన‌యంతో ఆ పాత్ర‌ల‌కు వారు ప్రాణం పోసిన తీరు అమోఘం. ఇటు రామ్‌, అటు సీత పాత్ర‌లు మ‌న‌ల్ని ఆక‌ట్టుకున్నాయంటే, హృద‌యాన్ని ఆక్ర‌మించుకున్నాయంటే.. అందుకు వారి న‌ట విన్యాస‌మే ప్ర‌ధాన కార‌ణం. ఈ సినిమా త‌ర్వాత మృణాల్‌తో ప్రేమ‌లో ప‌డ‌ని వాళ్లుండ‌రేమో! ఈ ప్రేమ‌క‌థ మ‌లుపు తీసుకోవ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే విష్ణుశ‌ర్మ పాత్ర‌లో సుమంత్ రాణించాడు. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న కెరీర్ దిశ మారే అవ‌కాశం ఉంది. ఆర్మీలో రామ్ స‌హ‌చ‌రుడు, స్నేహితుడు వికాస్ శ‌ర్మ‌గా శ‌త్రుకు మంచి పాత్ర ల‌భించింది. అత‌ను కూడా ఆ పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. హైద‌రాబాద్‌లో రామ్ స్నేహితుడు దుర్జ‌య్ శ‌ర్మ‌గా వెన్నెల కిశోర్ త‌న‌దైన శైలితో వినోదాన్ని అందించాడు. సీత అన్న‌గా జిషు సేన్‌గుప్తా, రామ్ పై ఆఫీస‌ర్‌గా గౌత‌మ్ మీన‌న్‌, పాకిస్తాన్ సైన్యాధికారి తారిఖ్‌గా స‌చిన్ ఖెడేక‌ర్ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. క‌థ‌ను న‌డిపించే స్పెష‌ల్ రోల్స్‌లో ర‌ష్మిక‌, త‌రుణ్ భాస్క‌ర్ స‌రిగ్గా స‌రిపోయారు. ర‌ష్మిక క్యారెక్ట‌ర్‌లోని ట్విస్ట్ కూడా ఆక‌ట్టుకుంటుంది. భూమిక‌, ప్ర‌కాశ్‌రాజ్ గెస్ట్ రోల్స్‌లో క‌నిపించారు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
క‌శ్మీర్‌లో బోర్డ‌ర్ ద‌గ్గ‌ర ఆర్మీలో ప‌నిచేసే రాజ‌మండ్రి అబ్బాయి లెఫ్టినెంట్ రామ్‌కూ, హైద‌రాబాదీ అమ్మాయి సీత‌కూ మ‌ధ్య పుట్టిన ప్రేమ‌ను డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి చిత్రీక‌రించిన తీరు క్లాసిక్ అనిపించేలా అత్యుత్త‌మ స్థాయిలో ఉంది. న‌దీ ప్ర‌వాహం లాంటి 'సీతారామం' ప్రేమ‌క‌థ‌లోని మ‌లుపులు, ఎత్తులు, ప‌ల్లాలు, అడ్డంకులు మ‌న హృద‌యాల్ని త‌ప్ప‌కుండా తాకి తీరుతాయి.

రేటింగ్: 3.5/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.