సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై మూవీ రివ్యూ
on Jun 9, 2023
సినిమా పేరు: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
నటీనటులు: మనోజ్ బాజ్ పాయ్, సూర్య మోహన్ కులశ్రేష్ట, ప్రియాంక సీతియా, విపిన్ శర్మ, నిఖిల్ పాండే, జైహింద్ కుమార్ తదితరులు
సంగీతం: సంగీత్ సిద్దార్థ్
సినిమాటోగ్రఫీ: అర్జున్ కక్రీతి
ఎడిటింగ్: సుమీత్ కోటియాన్
రచన: దీపక్ కింగ్రాణి
నిర్మాతలు: వినోద్ భానుశాలి, కమలేశ్ భానుశాలి
దర్శకత్వం: అపూర్వ సింగ్ ఖర్కీ
ఓటీటీ వేదిక: జీ5
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఓటీటీలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. అందులో మనోజ్ బాజ్ పాయ్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మనోజ్ బాజ్ పాయ్ లాయర్ పాత్రలో కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' సినిమా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం
కథ:
మైనర్ బాలిక 'ను'(అద్రిజ సిన్హా) పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, బయట ప్రపంచానికి మంచివాడిలా కనిపించే ఒక కీచక బాబాజీ(సూర్య మోహన్ కులశ్రేష్ట) తనని లైంగికంగా వేధించాడని కంప్లైంట్ చేస్తుంది. 'ను' కంప్లైంట్ ఆధారంగా విచారణ కోసం పోలీసులు ఆ బాబాజీని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరుస్తారు. అయితే 'ను' తరుపున వాదించే లాయర్ డబ్బులకి ఆశపడి కేస్ ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. తమ లాయర్ ఇలా చేస్తున్నాడని తెలుసుకున్న 'ను' వేరొక లాయర్ సోలంకి(మనోజ్ బాజ్ పాయ్) దగ్గరికి వెళ్తుంది. అయితే 'ను' బాధని అర్థం చేసుకున్న సోలంకి కేసు టేకప్ చేస్తాడు. ఆ తర్వాత కోర్టులో పి.సి. సోలంకి ఎదురైన ఇబ్బందులేంటి? బాబాజీకి శిక్షపడేలా చేశాడా? 'ను' కి సోలంకి న్యాయం జరిగేలా చేశాడా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒక మైనర్ బాలిక పోలీస్ స్టేషన్లో పలుకబడి ఉన్న బాబాజీ మీద కంప్లైంట్ ఇవ్వడంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత ఆ కేస్ అంతకంతకు క్లిష్టంగా మారడం.. బాధితురాలికి వ్యతిరేకంగా బాబాజీ కోసం ఎంతో సమర్థవంతమైన న్యాయవాదులు వాదించినా సోలంకి బెయిల్ రాకుండా చేస్తాడు. ప్రతీ సెషన్ లో బాబాజీకి బెయిల్ నిరాకరించేలా చేసిన సోలంకి తను అనుకున్నది అనుకున్నట్లుగా చేసాడు. కోర్ట్ రూం డ్రామాలో ప్రతీసారి సాక్ష్యాలు తారుమారు చేయడం అపోజిట్ న్యాయవాది చేస్తుంటాడు. అయితే వారికి ఎక్కడ కూడా ఛాన్స్ రాకుండా లాయర్ సోలంకి భాదితురాలి వివరాలు చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి కోర్ట్ లో సమర్పించి న్యాయాన్ని గెలిపించాడు.
డబ్బుకి దాసోహమైన సమాజంలో ఒక్కసారి బాబాజీకి బెయిల్ వస్తే ఆ తర్వాత న్యాయాన్ని తమ డబ్బు పలుకుబడితో కొనేస్తాడని సోలంకి చెప్తాడు. అయితే క్లైమాక్స్ వరకు సెషన్స్, కోర్ట్ సీన్స్ అంటూ ఆసక్తికరంగా సాగుతున్న తరుణంలో డైరెక్టర్ అపూర్వ సింగ్ ఖర్కీ ఎలాంటి పాటలకి, ఫైట్స్ కి వెళ్ళలేదు. కథని డైవర్ట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ప్రథమార్ధం నుండి కథ ఆసక్తికరంగా సాగుతుంది అయితే మధ్యలో రూల్ నెం 12 గురించి సోలంకి ఒక సీనియర్ లాయర్ కి చెప్పడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పోక్సో చట్టం గురించి అప్పటికే చాలా కేస్ లు వాదించిన సోలంకి ఎందుకని అపోజిట్ లాయర్ వేసిన కొన్ని ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. అయితే సోలంకి బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాక్ష్యాలన్నీ ఎలా సంపాదించాడు. దేని ద్వారా ఇతనికి ఆధారాలు లభించాయనేది చూపించలేదు. అవి చూపిస్తే కథ ఇంకా గ్రిస్పింగ్ గా ఉండేది.
ఒక స్కూల్ వాళ్ళు అడ్మిషన్ ఇచ్చినట్టు చెప్పగా వాళ్ళు ఫేక్ అని సోలంకి నిరూపించే సీన్స్ కథకి ప్రాణం పోశాయి. కోర్ట్ లో ఎప్పుడు తప్పుడు సాక్ష్యం చెప్పకూడదని చెప్తూ.. అపోజిట్ లాయర్ మొదటి నుండి భాదితురాలు మైనర్ అని నిరూపించాలని అనుకుంటున్నట్టుగా తెలియజేస్తూ మద్దతు తీసుకున్నాడు. కథ ఎక్కడా కూడా బోరింగ్ గా ఉండదు. ఎలాంటి ట్విస్ట్ లు ఉండవు. నిజాలే సాక్ష్యాలు, అవే నిజమైన ఆధారాలు అంటు సాగుతూ ఉంటుంది. అయితే కథ చివరలో రామాయణం గురించి చెప్తూ అందులో ప్రస్తావించిన మహాపాపం గురించి జనాలకి తెలిసేలా చెప్పారు. అలా ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది. అయితే సినిమాలో ట్విస్ట్ లు లేకపోవడం కాస్త నిరాశని కలుగజేస్తాయి. ఇలాంటి కోర్ట్ రూం డ్రామాలో ట్విస్ట్ లు ఉండి ఉంటే ఇంకా గ్రిస్పింగ్ గా ఉండేది. రెండుగంటల నిడివి గల ఈ సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చివరి వరకు ప్రేక్షకుడిని కూర్చోబెట్టేలా చేస్తుంది.
సుమీత్ కోటియాన్ ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా కూడా అనవసరమైన సీన్స్ లేకుండా జాగ్రత్తగా కత్తిరించాడు. అర్జున్ సినిమాటోగ్రఫీ బాగుంది. కోర్ట్ సీన్స్ బాగా తీసాడు. సంగీత్ సిద్దార్థ్ రాయ్ సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
మైనర్ బాలిక 'ను' పాత్రలో అద్రిజ సిన్హా ఆకట్టుకుంది. సొసైటీలో జరుగుతున్న లైంగిక వేధింపులకు ఎదురుగా నిలబడి పోరాడే అమ్మాయిగా అద్రిజ సిన్హా ఒదిగిపోయింది. లాయర్ పి.సి సోలంకి పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ తన నటనతో, హావభావాలతో సినిమాని నిలబెట్టాడు. ప్రతీ సందర్భంలోను తన సహజ సిద్ధమైన ప్రవర్తనలాగా ఆకట్టున్నాడు. మిగతా నటీనటులు వారి వారి పాత్రలకి న్యాయం చేశారు.
తెలుగువన్ ఎనాలసిస్:
కోర్ట్ రూమ్ డ్రామాలో ట్విస్ట్ లు ఎక్కువగా లేకపోయినప్పటికీ ఆసక్తికరంగా సాగిపోయే ఈ మూవీని హ్యాపీగా చూసేయొచ్చు.
రేటింగ్: 3/5
✍🏻. దాసరి మల్లేశ్

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
