
'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ అంటే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తు పడతారేమో! 'బొమ్మరిల్లు'కు ముందు తరవాత తెలుగులో విరివిరిగా సినిమాలు చేసిన సిద్ధార్థ్... కొంతకాలంగా తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులను డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తున్నారు. త్వరలో ఈ హీరో స్ట్రయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అయితే... నటుడిగా కాదు, గాయకుడిగా! సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'నిను వీడని నీడను నేను'. ఇందులో సిద్ధార్థ్ ఓ పాట పాడాడు. ఎస్.ఎస్. తమన్ సంగీతంలో ఈ పాటను రికార్డ్ చేశారు. 'బాయ్స్' సినిమాలో సిద్ధార్థ్, తమన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. తరవాత సిద్దార్థ్ సినిమాలకు తమన్ సంగీతం కూడా అందించాడు. అయితే... తమన్ సంగీతంలో మరో హీరో కోసం సిద్ధార్థ్ పాట పాడటం ఇదే తొలిసారి. సంగీతంలో తెలుగు భాష తీయగా ఉంటుందని సిద్ధార్థ్ అన్నాడు.






