తమన్ పాటలన్నీ చెత్తబుట్టలోకి.. ఏ క్యా హై రాజాసాబ్..?
on Mar 19, 2025
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ది రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. నిజానికి 'రాజా సాబ్' ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడింది. ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్స్ తో పాటు, రీ షూట్ లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజా సాబ్ నుంచి ఇప్పటిదాకా ఒక గ్లింప్స్, రెండు మూడు పోస్టర్లు తప్ప పెద్దగా అప్డేట్స్ కూడా రాలేదు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ స్వరపరిచిన పాటలు అదిరిపోయాయంటూ అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. దీంతో రాజా సాబ్ సాంగ్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో.. తాను స్వరపరిచిన పాటలన్నీ వేస్ట్ అని, వాటిని చెత్తబుట్టలో పడేశానని తమన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. (The Raja Saab)
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. "రాజా సాబ్ కోసం ఇప్పటికే కంపోజ్ పాటలన్నీ అవుట్ డేటెడ్ అయిపోయాయి. మళ్ళీ కొత్త సాంగ్స్ రెడీ చేసే పనిలో ఉన్నాను." అన్నాడు. ఇది ఒక రకంగా షాకింగ్ స్టేట్ మెంట్ అని చెప్పవచ్చు. అయితే అలా చేయడానికి కారణమేంటో కూడా తమన్ తెలిపాడు. "అవి అప్పుడెప్పుడో కంపోజ్ చేసిన పాటలు. ఇప్పుడు ట్రెండ్, టెక్నాలజీ మారిపోయాయి. అందుకు తగ్గట్టుగా సాంగ్స్ ఇవ్వాలి." అని తమన్ చెప్పుకొచ్చాడు. ఇంకో ఆసక్తికర విషయాన్ని కూడా తమన్ పంచుకున్నాడు. సాంగ్స్ మళ్ళీ కంపోజ్ చేయాలనే నిర్ణయం తనదేనని, ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పి ఒప్పించానని వెల్లడించాడు. ప్రభాస్ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎదురుచూస్తారు, ఆడియో కంపెనీలు కూడా ఒక్కో ఆల్బమ్ కి 30-40 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అందుకే మంచి మ్యూజిక్ అందించాల్సిన బాధ్యత తనపై ఉందని తమన్ అన్నాడు.
ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ ఆలస్యమైంది. ఇక ఇప్పుడు తమన్ కొత్త సాంగ్స్ కంపోజ్ చేస్తున్నానని చెప్పడంతో సినిమా మరింత ఆలస్యమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజా సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఇంకా సాంగ్స్ షూటింగ్ మొదలు కాలేదు. టాకీ పార్ట్ పూర్తయ్యాక, సాంగ్స్ షూట్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో మూవీ టీం ఉందట.
మరి తమన్ కంపోజ్ చేసే కొత్త పాటలు ఎలా ఉంటాయో చూడాలి. రాజాసాబ్ సాంగ్స్ ప్రభాస్ వింటేజ్ కమర్షియల్ సాంగ్స్ ని గుర్తు చేసేలా ఉంటాయనే టాక్ ముందు నుంచి ఉంది. ఇంట్రో సాంగ్, మెలోడీ, ఐటెం సాంగ్ ఇలా అన్ని రకాల పాటలతో.. పక్కా కమర్షియల్ ఆల్బమ్ లా రాజాసాబ్ ఉంటుందని అంటున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
