ENGLISH | TELUGU  

ఆర్జీవి ‘వ్యూహం’కు షాక్‌.. నవంబర్‌ 10 రిలీజ్‌ లేనట్టే?

on Nov 2, 2023

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఎవరు ఏ కామెంట్‌ చేసినా, ఎవరు ఎలా అతన్ని ట్రోల్‌ చేసినా ఏ చలనం లేని దర్శకుడుగా మారిపోయాడన్నది అందరి అభిప్రాయం. ఒకప్పుడు ఎవ్వరూ టచ్‌ చేయడానికి కూడా సాహసించని సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకున్న మాట వాస్తవమే. ఒకప్పుడు రామ్‌గోపాల్‌వర్మ మకాం ముంబాయి. ఎప్పుడో ఒకసారి హైదరాబాద్‌ వచ్చేవాడు. అది మీడియాకు ఒక సెలబ్రేషన్‌లా ఉండేది. లోకల్‌ మీడియా నుంచి నేషనల్‌ మీడియా వరకు అందరూ ఎగబడి వచ్చేవారు. వర్మ ఏం చెబుతాడా అని శ్రద్ధగా వినేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి ఉందా? అంటే ముమ్మాటికీ లేదనే చెప్పాలి. 

ఒక గొప్ప స్టేజ్‌ నుంచి అందరే చీదరించుకునే స్టేజ్‌కి వచ్చాడంటే అది స్వయంకృతాపరాధమే. ఒకప్పుడు డైరెక్టర్‌ అంటే రామ్‌గోపాల్‌వర్మ తర్వాతే ఎవరైనా అనే స్థాయి నుంచి దిగజారిపోయి సి గ్రేడ్‌, డి గ్రేడ్‌... ఇలా ఒక్కో మెట్టూ దిగుతూ సినిమా చేసి తనకున్న పేరును తనే నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు పొలిటికల్‌ మూవీస్‌ చేస్తూ రాజకీయ నాయకులు కూడా తిట్టుకునే స్థాయికి వచ్చాడు. 

తాజాగా ‘వ్యూహం’ పేరుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? వంటి అంశాలతో ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ముందే అంటే నవంబర్‌ 10న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు. అయితే సెన్సార్‌ బోర్డ్‌ ‘వ్యూహం’ టీమ్‌కి, రామ్‌గోపాల్‌వర్మకు షాక్‌ ఇచ్చింది. ఈ సినిమాకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సినిమాలోని పాత్రలకు నిజజీవితంలోని వ్యక్తుల పేర్లను పెట్టడంపై సెన్సార్‌బోర్డ్‌ అభ్యంతరం తెలిపింది. అలాగే ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్న పరిణామాలనే కథగా తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో ‘వ్యూహం’ నవంబర్‌ 10కి రిలీజ్‌ లేదని, కొందరు అసలు ‘వ్యూహం’ రిలీజే లేదని ఊహాగానాలు చేస్తున్నారు. 

‘వ్యూహం’ సినిమాకి సంబంధించి సెన్సార్‌ ఎలాంటి అభ్యంతరాలు చెప్పింది, అధికారికంగా చిత్ర యూనిట్‌కి అందిన సమాచారం ఏమిటి? అనేది వివరించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ తమకు సెన్సార్‌ బోర్డు నుంచి వచ్చిన లెటర్‌లో ఒకే ఒక వాక్యం ఉందని, అది  ‘ఈ సినిమాను రివైజింగ్‌ కమిటీకి రిఫర్‌ చేస్తున్నాం’ అని మాత్రమేనని వర్మ చెప్పారు. రివైజింగ్‌ కమిటీ సినిమాను ఎప్పుడు చూస్తుంది అనేది తెలియదని, కాబట్టి నవంబర్‌ 10న రిలీజ్‌ చెయ్యాలనుకున్న సినిమాను వాయిదా వేస్తున్నామని తెలిపారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.