'అపరిచితుడు' కథ నాదే.. అది కూడా తెలీదా?.. శంకర్ స్ట్రాంగ్ రిప్లై
on Apr 15, 2021
'అపరిచితుడు' హిందీ రీమేక్ వ్యవహారం నిన్నటి నుంచి హెడ్‌లైన్స్‌లో నలుగుతూనే ఉంది. మొదట ఆ సినిమాని రణవీర్ సింగ్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నట్లు శంకర్ ప్రకటించారు. అయితే ఆ కథ పూర్తి హక్కులు తన దగ్గర ఉన్నాయనీ, దాన్ని రీమేక్ చేసే హక్కు నీకెక్కడిది? అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాననీ ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఆస్కార్ రవిచంద్రన్ శంకర్‌కు ఓపెన్ లెటర్ రాయడమే కాకుండా, లీగల్ నోటీస్ సైతం పంపారు.
తాజాగా దానికి గట్టి సమాధానం ఇచ్చారు డైరెక్టర్ శంకర్. తెలిసి మాట్లాడుతున్నావా, తెలీక మాట్లాడుతున్నావా? అనే రేంజిలో ఆస్కార్ రవిచంద్రన్‌కు లెటర్ పంపారు. 'అన్నియన్' (అపరిచితుడు) మూవీ కథ మీదని క్లైమ్ చేస్తూ మీరు పంపిన మెయిల్ చూసి షాకయ్యానంటూ లెటర్ మొదలుపెట్టారు. "2005లో విడుదలైన ఆ సినిమాకు పనిచేసిన అందరికీ ఆ స్క్రిప్టు, స్టోరీలైన్ పూర్తిగా నావేనని తెలుసు. నిజానికి ఆ సినిమా "కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్" అనే ట్యాగ్‌తో రిలీజయ్యింది. ఆ స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రాసే పనిని ఏ వ్యక్తికీ నేను అప్పగించలేదు." అని ఆయన స్పష్టం చేశారు.
అందువల్ల ఆ స్క్రిప్టును ఏ రకంగానైనా మార్చుకొనే హక్కు తనకు ఒక్కడికే ఉందని ఆయన తెలిపారు. "దివంగత సుజాత గారి పేరును మీరు ప్రస్తావించడం చూసి నాకు ఆశ్చర్యమేసింది. ఆ సినిమాకు కేవలం డైలాగ్స్ రాయడానికి నేనే ఆయనను నియమించుకున్నాను. దానికి అనుగుణంగానే ఆయనకు క్రెడిట్ ఇచ్చాం. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే విషయాల్లో కానీ, క్యారెక్టరైజేషన్స్ విషయంలో కానీ ఆయన జోక్యం ఏమాత్రం లేదు. డైలాగ్ రైటింగ్ మించి వేరేగా జోక్యం చేసుకొనే స్కోప్ కూడా ఆయనకు లేదు." అని తేల్చేశారు శంకర్.
అంతేకాదు, 'అన్నియన్'ను వేరే ఏ భాషలోనూ రీమేక్ చేసే హక్కు కానీ, ఆ స్క్రిప్టును వేరే రకంగా వాడే హక్కు కానీ ఆస్కార్ రవిచంద్రన్‌కే లేదని ఆయన చెప్పారు. "రాతపూర్వకంగా ఆ హక్కుల్ని నేను మీకు ఇవ్వలేదు. రాతపూర్వకంగా అలాంటిదేమీ లేనప్పుడు, ఆ స్టోరీలైన్ హక్కులు మీకు చెందుతాయనే దాంట్లో ఏమాత్రం ఆధారం లేదు. ఈ క్లారిఫికేషన్ తర్వాత మంచి సెన్స్‌తో మీరు ఉంటారనీ, ఆధారరహిత ఆరోపణలు ఆపుతారనీ ఆశిస్తాను." అని ఉత్తరంలో పేర్కొన్నారు శంకర్.
ఎలాంటి దురభిప్రాయం లేకుండా తన భవిష్యత్ ప్రాజెక్టులకు అనవసరంగా హాని కలిగించేందుకు ప్రయత్నించకుండా ఉండటానికీ, వాస్తవ పరిస్థితిని స్పష్టం చేయడానికీ ఈ సమాధానం ఇస్తున్నాననీ ఆయన స్పష్టం చేశారు.