ENGLISH | TELUGU  

భార‌త్‌, పాక్‌ మ‌ధ్య తేడా ష‌హీన్ అఫ్రిది! వాళ్ల‌కు హీరో, మ‌న‌కు విల‌న్‌!!

on Oct 25, 2021

 

రోహిత్‌కు శ‌ర్మ‌కు ఫ‌స్ట్ బాల్‌.. దుబాయ్‌లో ఓవ‌ర్ ద వికెట్ తీసుకొని ష‌హీన్ షా అఫ్రిది బౌలింగ్ చేయ‌డానికి ప‌రుగెత్తుతుంటే గ్యాల‌రీల్లోంచి పాకిస్తాన్ ఫ్యాన్స్ నుంచి వ‌చ్చిన ఒకే మాట‌.. "ష‌హీన్‌! ష‌హీన్‌! ష‌హీన్‌!" వారిలో జ‌పాన్ నుంచి వ‌చ్చిన‌ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అఫ్రిది వేసిన ఇన్‌స్వింగింగ్ యార్క‌ర్ రోహిత్ బ్యాట్‌ను బీట్ చేసి, అత‌డి బ్యాక్ లెగ్‌ను ముద్దాడింది. బ్యాంగ్‌.. ఎదుర్కొన్న ఫ‌స్ట్ బాల్‌కే రోహిత్ ఎల్బీడ‌బ్ల్యూ. ఆ బాల్ మిడిల్ స్టంప్‌ను మిడిల్‌లో స్మాష్ చేస్తుంద‌ని రీప్లేలో క‌నిపించింది. అఫ్రిదికి అది తెలుసు. మ‌న‌కూ తెలుసు. రోహిత్‌కూ తెలిసినా, దాన్ని జీర్ణం చేసుకోలేక‌పోయాడు. అంపైర్ క్రిస్ గ‌ఫానీ వేలు పైకెత్త‌క ముందే అఫ్రిది సెల‌బ్రేష‌న్స్‌లో మునిగిపోయాడు. తోటి బౌల‌ర్లు ఇమ‌ద్ వాసిమ్‌, షాదాబ్ ఖాన్ ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి అఫ్రిది భుజాల‌పై వాలిపోయారు. ప్ర‌తి పాకిస్తాన్ ఫ్యాన్‌కు రోహిత్ డ‌కౌట్‌తో ట్రీట్ ఇచ్చాడు అఫ్రిది.

ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లోనే మ‌రో ఓపెన‌ర్‌ కె.ఎల్‌. రాహుల్‌ను ఔట్ చేసి పాకిస్తాన్ ఫ్యాన్స్‌కు మ‌రింత సంబ‌రం క‌లిగించాడు. అత‌డేసిన బాల్‌ను ఎలా ఆడాలో అర్థంకాక తిక‌మ‌క‌ప‌డి కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చాడు రాహుల్‌. అది మూడో ఓవ‌ర్. ఇండియా స్కోర్ 2 వికెట్ల‌కు 6 ర‌న్స్‌. ప‌వ‌ర్ ప్లేలో ఎలా బౌల్ చేయాలో ష‌హీన్ మ‌న‌కు చూపించాడు. అత‌డి నిప్పులు చెరిగే బంతుల‌కు మ‌న బ్యాట్స్‌మ‌న్ బెంబేలెత్తిపోయారు. ప‌వ‌ర్ ప్లే (6 ఓవ‌ర్లు) ముగిసేస‌రికి మ‌న స్కోర్ 3 వికెట్ల‌కు 36 ప‌రుగులు మాత్ర‌మే. ఫీల్డింగ్ రెస్ట్రిక్ష‌న్స్ ఉండే ప‌వ‌ర్ ప్లేలో మ‌న యావ‌రేజ్ ఓవ‌ర్‌కు 6 ర‌న్స్ మాత్ర‌మే. ఈ ప‌వ‌ర్ ప్లేనే ఈ మ్యాచ్‌లో మ‌న జాత‌కాన్ని మార్చేసింది. అలా మార్చేసిన‌వాడు ష‌హీన్ అఫ్రిది. మ‌న‌వాళ్లు 100 ప‌రుగులు పూర్తి చేయ‌డానికి 15 ఓవ‌ర్లు తీసుకున్నారంటేనే ఎంత నెమ్మ‌దిగా ఆడారో అర్థ‌మ‌వుతుంది. చివ‌ర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కూడా అఫ్రిదీకే ద‌క్కింది. అంటే.. రోహిత్‌, రాహుల్‌, విరాట్‌.. ఎలాంటి వికెట్లు! 

అదే పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కు వ‌చ్చేస‌రికి ప‌వ‌ర్ ప్లేలో బాబ‌ర్ ఆజ‌మ్‌, రిజ్వాన్‌ల‌ను అలా వ‌ణికించే బౌల‌ర్ మ‌న‌వ‌ద్ద క‌రువ‌య్యాడు. ఫ‌స్ట్ ఓవ‌ర్ వేసిన భువ‌నేశ్వ‌ర్ ప‌ది ప‌రుగులు ఇచ్చుకున్నాడు. దాంతో మూడో ఓవ‌ర్‌ను అత‌డి చేత వేయించ‌కుండా బుమ్రాకు బంతి ఇచ్చాడు విరాట్‌. మొద‌టి మూడు ఓవ‌ర్ల‌ను భువ‌నేశ్వ‌ర్‌, మ‌హ్మ‌ద్ ష‌మి, బుమ్రా వేశారు. అయినా ఏ ఒక్క‌రూ పాక్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించ‌లేక‌పోయారు. మొద‌ట్లో కాస్త‌ నెమ్మ‌దిగా ఆడిన బాబ‌ర్‌, రిజ్వాన్ కుదురుకున్నాక అడ‌పా ద‌డ‌పా లూజ్ బాల్స్‌ను బౌండ‌రీ లైన్‌ను దాటించారు. 

భార‌త్‌, పాక్ మ్యాచ్ చూశాక స్ప‌ష్టంగా క‌నిపించింది.. మ‌న‌కు ష‌హీన్ అఫ్రిది లాంటి బౌల‌ర్ లేడ‌ని, రెండు జ‌ట్ల మ‌ధ్య తేడా అత‌డేన‌ని. అఫ్రిది ఇవాళ పాక్ ఫ్యాన్స్ దృష్టిలో సూప‌ర్‌స్టార్‌! భార‌త్ - 151/7, పాకిస్తాన్ - 152/0 అనే స్కోర్‌ను జీర్ణం చేసుకోవ‌డం ఇప్ప‌ట్లో భార‌త్ ఫ్యాన్స్‌కు చాలా క‌ష్టమే! 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.