లాక్డౌన్లో ఫ్యామిలీకి వంటచేసి పెట్టిన బాలీవుడ్ బాద్షా!
on Oct 17, 2020
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అనేక ఇంటర్వ్యూల్లో తన ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. ఫ్యాన్స్‌తో తన లైఫ్ గురించిన విషయాలను షేర్ చేసుకుంటూ, జీవితంలో ఎలాంటి సందర్భాల్లోనైనా మనకు తోడుగా ఉండే లైఫ్ పార్టనర్‌ను ఎంచుకోమంటూ వారిని ఇన్స్పైర్ చేస్తుంటాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన భార్య గౌరీ ఖాన్ కోసం అవసరమైతే తన సినీ కెరీర్‌ను వదిలేస్తానని కూడా చెప్పాడంటే.. ఆమెను అతనెంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. షారుఖ్, గౌరి.. ఇద్దరూ ఢిల్లీకి చెందినవాళ్లే. యంగ్ ఏజ్‌లోనే ఆమెతో ప్రేమతో పడి, పెళ్లి చేసుకున్నాడు షారుఖ్.
కాగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త షారుఖ్‌కు సంబంధించిన ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు గౌరీ ఖాన్. లాక్డౌన్లో షారుఖ్‌కు సంబంధించిన కొత్త కోణాన్ని చూశానని ఆమె చెప్పారు. లాక్డౌన్ కాలంలో ఫ్యామిలీ మొత్తానికి అతను స్వయంగా వంట చేసి పెట్టాడని ఆమె వెల్లడించారు. "ఈ లాక్డౌన్ కాలంలో, బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా మొదట మేం భయపడ్డాం. దాంతో, షారుఖ్ స్వయంగా 'ఘర్ కా ఖానా" తయారుచేస్తే, మేం దాన్ని తింటూ వచ్చాం. అతను వంట చేయడాన్ని ఇష్టపడితే, మేం అతని వంటను ఎంజాయ్ చేశాం" అని తెలిపారు గౌరి.
షారుఖ్ రాత్రికి రాత్రే సూపర్ స్టార్ కాలేదని ఆమె చెప్పారు. "అతనితో కలిసి ముంబైకి వచ్చినప్పుడు నా వయసు 21 ఏళ్లు. యాక్టర్‌గా అతనెంతో స్ట్రగుల్ అయ్యాడు. ఎత్తుపల్లాలు చవిచూశాడు. ఎంతో హార్డ్‌వర్క్‌తో ఈ స్థాయికి వచ్చాడు. ఇవాళ మేమంతా దాని ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం" అని ఎమోషనల్‌గా చెప్పారు గౌరి.