అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల2.. ఈ రెండు సినిమాలకూ ఒకే తప్పు జరిగింది!
on Apr 19, 2025
ఒక సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే కథ, కథనాలు ఎంత ముఖ్యమో.. సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలు, హారర్ సినిమాల విజయంలో సినిమాటోగ్రఫీ, సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తాయి. టాలీవుడ్‌లోని దర్శకనిర్మాతలు ఈ రెండు క్రాఫ్ట్స్‌కి సంబంధించి ఇతర భాషలకు చెందిన టెక్నీషియన్స్‌పైనే మొగ్గు చూపుతుంటారు. వేరే భాషలో ఏదైనా సినిమా సూపర్‌హిట్ అయితే ఆ టెక్నీషియన్స్‌ని టాలీవుడ్‌కి దిగుమతి చేసుకుంటారు. ఇటీవలి కాలంలో ఇతర భాషల్లోని సినిమాటోగ్రాఫర్లకు, సంగీత దర్శకులకు టాలీవుడ్‌లో డిమాండ్ పెరిగింది. 2009లో మ్యూజిక్ డైరెక్టర్‌గా కన్నడలో పరిచయమైన అజనీష్ లోకనాథ్.. అక్కడ ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. మ్యూజికల్‌గా చాలా సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. వాటిలో విక్రాంత్‌రోనా, కాంతార వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. అలాగే కిరిక్ పార్టీ అనే చిన్న సినిమా కూడా ఉంది. ఆ సినిమాను తెలుగులో కిరాక్‌పార్టీగా రీమేక్ చేసినపుడు అతన్నే మ్యూజిక్ డైరెక్టర్‌గా
టాలీవుడ్‌లో పరిచయం చేశారు. తర్వాత నన్ను దోచుకుందువటే చిత్రానికి కూడా సంగీతం అందించాడు. ఆ సినిమా తర్వాత నాలుగు సంవత్సరాల పాటు తెలుగులో మరో సినిమా చేయలేదు అజనీష్.
2022లో కన్నడలో రూపొందిన కాంతార చిత్రంతో మరోసారి అజనీష్ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై ఘనవిజయం సాధించింది. దీంతో తెలుగు మేకర్స్ అతనితో మళ్ళీ సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపించారు. అలా విరూపాక్ష, మంగళవారం చిత్రాలకు సంగీతం అందించాడు. ఈ రెండు సినిమాలు మ్యూజికల్‌గా కూడా మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా ఈ సినిమాలకు అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి చాలా మంచి పేరు వచ్చింది. తమ సినిమాలకు అజనీష్ మ్యూజిక్ మంచి ప్లస్ అవుతుందని భావించిన మేకర్స్ ఇటీవల విడుదలైన ఓదెల2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాలకు సంగీతం అందించే బాధ్యతను అతనికి అప్పగించారు. అజనీష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేస్తాడని పేరుంది. సినిమా అంటే బిజిఎం ఒక్కటే కాదని, పాటలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండాలనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానే చేసినా పాటల విషయంలో మాత్రం అతను ఫెయిల్ అయ్యాడు.
ఒకరోజు తేడాతో విడుదలైన ఓదెల2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాల్లో ఒక్క పాట కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వరసగా విడుదలైన రెండు సినిమాల్లోని పాటలు సూపర్‌హిట్ చెయ్యలేకపోవడంతో అజనీష్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓదెల2 వంటి సినిమాల్లో పాటలు ఆకట్టుకునే విధంగా ఉండాలి. కానీ, అలాంటి పాటలు అజనీష్ ఇవ్వలేకపోయారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. బీజీఎం అద్భుతంగా చేయడంలో అజనీష్ ఎక్స్‌పర్టే. కానీ, ఏ సినిమాకైనా అదే ప్రధానం కాదు. వీనుల విందైన పాటలు కూడా ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ, వాటిని అందించడంలో అతను మరోసారి విఫలమయ్యాడు. మరి అజనీష్‌కి తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు టాలీవుడ్ మేకర్స్ ముందుకు వస్తారా లేదా అనేది చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
