99 చాలవు... 100కు 100 రావాల్సిందే!
on Sep 19, 2018
స్కూల్లో టాపర్స్ కొందరుంటారు చూడండి... పరీక్షల్లో 100కు 99 మార్కులు వచ్చినా విపరీతంగా బాధ పడుతుంటారు. వచ్చే పరీక్షకు తీవ్రంగా కష్టపడి చదివి వందకు వంద మార్కులు తెచ్చుకోవాలని ఇంకా ఇంకా కృషి చేస్తుంటారు. అటువంటి జాబితాలో సమంత ముందుంటుందని దర్శకురాలు నందినీరెడ్డి అన్నారు. నందినరెడ్డి దర్శకత్వంలో సమంత ఒక సినిమా చేశారు. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఆ సినిమా 'జబర్దస్త్'. ప్రేక్షకులు ఎవరికీ సినిమా నచ్చలేదు. కాని ఆ సినిమాతో సమంత, నందినీరెడ్డి మంచి స్నేహితులు అయ్యారు. ఇప్పటికీ వాళ్ల స్నేహం చక్కగా కొనసాగుతుంది. స్నేహితురాలి కోసం వేరెవరో దర్శకత్వం వహించిన సినిమా డబ్బింగ్ సరిగ్గా రావడం కోసం నందినీరెడ్డి నాలుగు రోజులు కష్టపడ్డారు.
సమంత ప్రధాన పాత్రధారిగా కన్నడ దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'యూ టర్న్'. దీనికి సమంత స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ట్రైలర్ విడుదల కాగానే డబ్బింగ్ అసలు బాగోలేదని విమర్శలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సమంత నందినీరెడ్డిని డబ్బింగ్ థియేటర్‌కు పిలిపించుకుని మరలా డబ్బింగ్ చెప్పారు. సినిమా సక్సెస్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం జరిగిన సక్సెస్‌మీట్‌కి నందినీరెడ్డి కూడా వచ్చారు. అప్పుడు సమంత అంకితభావం గురించి ప్రశంసించారు. సమంతకు 99 మార్కులు వచ్చినా సంతృప్తి వుండదని.. వందకు వంద మార్కులు రావాలని కృషి చేస్తుందని పొగిడారు.