'హిట్' దర్శకుడికి 'గేమ్ ఛేంజర్' బాధ్యతలు!
on Jul 11, 2023

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు 'గేమ్ ఛేంజర్' విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ మధ్యలో దర్శకుడు శంకర్ 'ఇండియన్-2'తో బిజీ కావడంతో షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దానికి తోడు 'గేమ్ ఛేంజర్'కి సంబంధించి పెద్దగా అప్డేట్స్ కూడా లేకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే 'గేమ్ ఛేంజర్' సెకండ్ యూనిట్ బాధ్యతలను 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను కి అప్పగించినట్లు తెలుస్తోంది.
పెద్ద సినిమాలలో ప్రధాన తారాగణం లేని కొన్ని సన్నివేశాలను సెకండ్ యూనిట్ గా పరిగణించి, షూటింగ్ ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో దర్శకుడు లేకుండానే వాటిని చిత్రీకరిస్తుంటారు. ఎక్కువగా ఆ బాధ్యతను కో డైరెక్టర్ కి అప్పగిస్తుంటారు. అయితే 'గేమ్ ఛేంజర్' విషయంలో మాత్రం శైలేష్ ని రంగంలోకి దింపడం ఆసక్తికరంగా మారింది.
'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజుతో తనకున్న అనుబంధంతోనే శైలేష్ ఈ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా దిల్ రాజు బ్యానర్ లో 'విశ్వంభర' అనే ఓ భారీ చిత్రాన్ని చేయనున్నాడు శైలేష్. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా 'సైంధవ్' సినిమా చేస్తున్న శైలేష్.. ఆ తర్వాత దిల్ రాజు ప్రాజెక్ట్ తో బిజీ అయ్యే అవకాశముంది.
మరోవైపు కొంతకాలంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్, ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం మళ్ళీ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ మాత్రం శంకర్ ఆధ్వర్యంలోనే జరగనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



