ఈ సారి చిరు పాటను చెడగొట్టాడుగా..?
on Jan 30, 2018
అచ్చుగుద్దినట్లు చిరంజీవిని పోలి ఉండే మెగా హీరో సాయిథరమ్ తేజ్ మావయ్య దారిలోనే కూల్‌గా హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు. తన ప్రతీ అడుగులోనూ మావయ్య చిరంజీవి ముద్ర స్పష్టంగా కనిపించేలా చేస్తూ మెగా అభిమానులను తన వైపుకు తిప్పుకుంటున్నాడు. ఆ ప్లాన్‌లో భాగంగానే మెగాస్టార్ ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌ని రీమేక్ చేస్తున్నాడు సాయి . అప్పట్లో సుబ్రమణ్యం ఫర్ సేల్‌లో "గువ్వా గోరింక" సాంగ్‌ని రీమేక్ చేయగా.. మొన్నామధ్య వచ్చిన సుప్రీమ్‌లో యముడికి మొగుడులోని "అందం హిందోళం" పాటను రీమిక్స్ చేశాడు..
ఈ రెండు పాటల్లోనూ సాయి వేసిన స్టెప్స్, గ్రేస్, బాడీ లాంగ్వేజ్‌ను చూసిన ఆడియన్స్‌కి అలనాటి సుప్రీం చిరంజీవిని గుర్తుకు తెచ్చింది. తాజాగా వివి వినాయక్ దర్శకత్వంలో ఇంటిలిజెంట్ అనే సినిమా చేస్తున్న సాయిథరమ్.. ఈ మూవీలో కూడా మావయ్య నటించిన కొండవీటి దొంగ చిత్రంలోని "చమకు చమకు ఛాం" అనే పాటను రీమిక్స్ చేశాడు. దీనికి సంబంధించిన లిరికల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్.
ఇది విన్న వారికి కొత్తగా ఏమీ కనిపించలేదట. సౌండింగ్ ఏ మాత్రం బాలేదని... ట్యూన్స్‌ని మక్కీకి మక్కీ దించేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరు-విజయశాంతి ఒరిజినల్ సాంగ్‌లో ధరించిన కాస్ట్యూమ్స్‌ని ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా మార్చేసినట్లు అనిపిస్తోంది అంటున్నారు అభిమానులు. మొత్తానికి ఫస్ట్ రెండు సాంగ్స్‌కి వచ్చినంత రెస్పాన్స్ ఇప్పుడు రాలేదంటూ మెగాభిమానులు ఓపెన్‌గా చెబుతున్నారు. మరి తెరపై సాయిథరమ్-లావణ్యల కెమిస్ట్రీ ఎలా కుదిరిందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.