ENGLISH | TELUGU  

‘సగిలేటి కథ’ మూవీ రివ్యూ

on Oct 13, 2023

సినిమా పేరు: సగిలేటి కథ
తారాగణం: రవి మహాదాస్యం,విషిక కోట,రాజశేఖర్ అనింగి.నరసింహ ప్రసాద్ తదితరులు
సంగీతం: జస్వంత్ పసుపులేటి,
రచన, దర్శకత్వం, డీఓపీ,ఎడిటర్: రాజశేఖర్ సూద్మూన్
నిర్మాతలు: దేవి ప్రసాద్ బలివాడ,అశోక్ మిట్టపల్లి 
సమర్పణ: నవదీప్  
బ్యానర్: షేడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్పేస్  
విడుదల తేదీ: అక్టోబర్ 13, 2023 

ప్రస్తుతం నడుస్తున్న కాలం కంటే కొంచం వెనక్కి వెళ్లి ఒక ప్రాంతంలో జరిగిన నిజమైన సంఘటలని కధలుగా ఎంచుకొని సినిమాలు తెరకెక్కించడం అనేది ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న నయా ట్రెండ్. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ప్రభావం కావచ్చు. ఇప్పుడు ఈ సగిలేటి కథ సినిమా కూడా అలాగే పది సంవత్సరాల క్రితం రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలో జరిగిన కథ. ఒక గ్రామానికి చెందిన ఆచారాలు ఎలా ఉంటాయి అక్కడి మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది, పగ ప్రతీకారాలు ఎలా ఉంటాయి అనే వాటిమీద ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సగిలేటి కథ మూవీ కూడా అదే కోవకి చెందిన సినిమా. రాయలసీమ ప్రాంతంలోని సగిలేటి అనే గ్రామం లో జరిగిన కథే ఈ సినిమా. మరి ఈ  సగిలేటి కథ ఎంతవరకు పేక్షకులకి నచ్చుతుందో చూద్దాం.

కథ 
2013 వ సంవత్సరం లో ఈ కథ ప్రారంభం అవుతుంది. హీరో రవి మహాదాస్యం అతని తల్లి కువైట్ నుంచి తమ స్వగ్రామం అయిన సగిలేటికి వస్తారు. సాధారణంగా నేటికీ  చాలా గ్రామాల్లో సొంత ఊరు నుంచి వేరే ప్రాంతానికి వెళ్లి మళ్ళీ తిరిగి సొంత ఊరికి వచ్చిన కుర్రోళ్ళు ఒక లెవెల్లో బిల్డప్  ఇస్తుంటారు. కానీ రవి మాములుగా అందరిలాగానే ఉంటాడు. కానీ అతని తల్లి మాత్రం కళ్ళకి కూలింగ్ కళ్ళజోడు పెట్టుకొని ఒళ్ళంతా నగలు ధరించి కువైట్ దర్పాన్ని చూపిస్తూ ఉంటుంది. అదే గ్రామంలో హీరోయిన్ విషిక ఉంటుంది. రవి ,విషిక లు ప్రేమించుకుంటారు. కానీ రవి ,విషిక ల కుటుంబాలకి పడదు.ఇంకో పక్క గ్రామంలో వర్షాలు పడటంలేదని సగిలేటి గ్రామదేవత అయిన గంగానమ్మకి  ఎప్పటిలాగానే జాతరలాంటిది చెయ్యాలని నిర్ణయించుకుంటారు. గంగానమ్మ జాతర ప్రతి సంవత్సరం ఒక మంచి ముహూర్తంలో  విషిక వాళ్ళ వంశస్థుల చేతుల మీదుగా జరుగుతుంది. ఇలా ఎప్పటి లాగానే జాతర టైం వస్తుంది. విషిక వాళ్ళు ఇంటి దగ్గరనుంచి బయలు దేరుతారు. కానీ అనుకోకుండా లేటుగా బయలుదేరుతారు.రవి తండ్రి ఆ జాతరని ప్రారంభిస్తాడు. ఆ తర్వాత విషిక తండ్రి వచ్చి రవి తండ్రి తో గొడవపడి అన రాని  మాట అనడంతో రవి తండ్రి విషిక తండ్రిని చంపుతాడు. మరి ఆ తర్వాత  విషిక ఏం చేసింది? రవి ప్రేమ ఏమైంది ? అలాగే ఇదే కథకి  లింక్ గా ఒక పక్కన పారలల్ గా ఇంకో కథ జరుగుతూ ఉంటుంది. చికెన్ తినాలని ఆశపడుతూ  తినబోయే టైం కి ఏదో ఒక అవాంతరం వచ్చి ఆగిపోయే నరసింహ ప్రసాద్ చివరకి చికెన్ తిన్నాడా?అతనికి రవి వితికల ప్రేమకి  సంబంధం  ఏమిటి అనేది మిగతా కథ 

ఎనాలసిస్ 
నేడు వస్తున్న అర్ధం పర్ధం లేని కొన్ని సినిమా ల కథల కంటే ఇది మంచి కథే. ఒక సినిమా ప్రేక్షకులకి నచ్చటానికి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించడానికి  ఈ కథ సరిపోతుంది. కాకపోతే ఈ కథ ని ఎలా చెప్తున్నాం మనం ఎంచుకున్న క్యారక్టర్ లు ఈ కథకి ఎలా ఉపయోగ పడుతున్నాయి అనేది చాలా ముఖ్యం. అలాగే ఎన్నో సార్లు చెప్పుకున్నట్లు ఒక మంచి కథని చెడ్డ స్క్రీన్ ప్లే తో ప్లాప్ చెయ్యవచ్చు. ఒక చెడ్డ కథని మంచి స్క్రీన్ ప్లే తో హిట్ చెయ్యవచ్చు. ఈ సగిలేటికి కనుక మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కుదిరి ఉంటే సినిమా ఎక్కడో ఉండేది. అలాగే అందరు కొత్త వాళ్ళు అవ్వడం కొంచం ఇబ్బందిగా ఉంది. ఎలాగూ సినిమా మొత్తం సగిలేటి అనే ఒక ఊరిలోనే తీశారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం పెంచితే బాగుండేదేమో. ఎలాగూ ఈ సినిమాకి ప్రముఖ నటుడు నవదీప్ సమర్పకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ వైపుగా ఆలోచిస్తే బాగుండేది.
 
నటీనటుల పనితీరు 
ఈ సగిలేటి కథలో నటించిన ఆర్టిస్టులందరు చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా  హీరో హీరోయిన్లు గ నటించిన రవి తేజ, విషిక ఇద్దరు కూడా చాలా చక్కగా నటించారు. కెమెరా  యాంగిల్ లో ఎటు నుంచి చూసినా కూడా ఇద్దరు చాలా బాగున్నారు. అలాగే రవి కి కనుక మంచి కథల తో సరైన సినిమా పడితే  పెద్ద హీరో రేంజ్ కి వెళ్తాడు. దర్శకులు  అతనికి అవకాశాలు ఇవ్వడం మీదే అతని సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాగే హీరో తండ్రి కూడా సూపర్ గా చేసాడు. ఆయనకి  కూడా దర్శకులు అవకాశాలు ఇస్తే తెలుగు సినిమా పరిశ్రమకి మంచి విలన్ దొరికినట్టే. ఈ సినిమాలో ముఖ్యంగా  చెప్పుకోవలసింది కోడి కూర తినాలనుకొనే  క్యారక్టర్ లో నరసింహ ప్రసాద్ సూపర్ గా కామెడీ ని పండించాడు. ఒక రకంగా  చెప్పాలంటే అతనే ఈ సినిమా ని కాపాడాడు అని చెప్పవచ్చు. అతని భార్యగా చేసిన అమ్మాయి కూడా బాగానే  చేసింది.

తెలుగు వన్ పర్ స్పెక్టివ్
అచ్చంగా ఒక గ్రామంలో జరిగిన సంఘటనని చెప్పాలనుకుని సగిలేటి కథలు అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని దర్శకుడు మరి రియలిస్టిక్ గా చెప్పాలనుకొని సినిమా ఫార్మేట్ ని మరిచిపోయినట్టుగా అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్ కథలు సినిమా సూత్రం ఆధారంగానే తెరకెక్కాయని సంగతిని దర్శకుడు  మర్చిపోయాడేమో. ఏది ఏమైనా అచ్చం తెలుగు నటులతోనే  ఇలాంటి సినిమా తియ్యడం మంచి ప్రయ్నతమే. ఇలాంటి సినిమాలు వస్తేనే గాని కథల వంకతో భారీ బడ్జెట్ తో  సినిమా తీసి డబ్బు దుబారా చేసే వాళ్ళకి సినిమా అంటే ఏమిటో తెలుస్తుంది. ఈ మూవీ టైటిల్ బ్యాక్ గ్రౌండ్ లో  కోడిని పెట్టినట్టు  కోడే ఈ సినిమా ని కాపాడింది. కోడి పాట కూడా బాగుంది. టోటల్ గా చెప్పుకోవాలంటే పరవాలేదనిపించే సినిమా ఇది. ఒక్కటి మాత్రం నిజం సినిమా చూసి బయటకి రాగానే చికెన్ బిర్యానీ అమ్మే హోటల్స్ ,చికెన్ కర్రీ అమ్మే కర్రీ పాయింట్ లు కిటకిటలాడటం ఖాయం..

రేటింగ్: 2.5/5

-అరుణాచలం

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.