ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై నాలుగేళ్లు దాటుతున్నా.. ఈ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ పోషించిన పాత్రల్లో ఎవరిది ఎక్కువ ప్రాధాన్యత అనే చర్చ మాత్రం అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్, చరణ్ అభిమానులు తమ హీరోనే ప్రధాన కథానాయకుడంటూ పోస్టులు, మీమ్స్‌తో వాదనలు చేసుకుంటున్నారు.
ఇటీవల ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఎంట్రీకి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ చర్చ మరింత ముదిరింది. పులి నేపథ్యంలో రూపొందించిన ఎన్టీఆర్ ఎంట్రీ విజువల్స్‌ను కొందరు ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ పులిని ఎదుర్కొనే సన్నివేశాలతో కలిపి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇరు హీరోల అభిమానుల మధ్య పాత వాదనలు మరోసారి మొదలయ్యాయి. సినిమాలో ఎన్టీఆర్ కేవలం సైడ్ క్యారెక్టర్ అంటూ కొందరు పోస్టులు చేస్తుండగా.. మరి కొందరు భీమ్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్, భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయని కౌంటర్లు ఇస్తున్నారు.
ఇదే సమయంలో ‘ఆర్ఆర్ఆర్’లో మెయిన్ హీరో ఎవరు అంటూ ఎలన్ మస్క్‌కు చెందిన గ్రోక్ ఏఐని నెటిజన్లు ప్రశ్నించగా.. జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రధాన కథానాయకుడిగా పేర్కొన్న సమాధానం గతంలో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అయితే ఏఐ ఇచ్చిన సమాధానాన్ని ఆధారంగా చేసుకుని సినిమాలో ఎవరి పాత్ర ఎక్కువ అని తేల్చడం సరికాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ కథనే కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు అనే ఇద్దరు ప్రధాన పాత్రల చుట్టూ నిర్మించారు. సినిమాలో ఎన్టీఆర్ భీమ్‌గా, రామ్‌చరణ్ రామరాజుగా కనిపించారు.
సినిమాను పరిశీలిస్తే ఇద్దరు హీరోలకూ ప్రత్యేకమైన ఎలివేషన్ సన్నివేశాలు ఉన్నాయి. భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌కు ‘కొమురం భీముడో’ పాటతో పాటు ఇంటర్వెల్‌లో జంతువులతో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు రామ్‌చరణ్ పాత్రకు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించే సన్నివేశాలతో పాటు క్లైమాక్స్‌లో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో వచ్చే ఎలివేషన్ కీలకంగా నిలిచింది. ఇద్దరు పాత్రలను సమాంతరంగా నడిపిన మల్టీస్టారర్ కావడంతో ఒకరిని మాత్రమే మెయిన్ హీరోగా పేర్కొంటూ అభిమానులు సోషల్ మీడియాలో వాదించుకోవడం కొనసాగుతూనే ఉంది.
[RRR Movie, Jr NTR, Ram Charan, RRR Fan War, RRR Main Hero, SS Rajamouli, RRR Movie Controversy, NTR Fans, Ram Charan Fans, RRR Social Media]




.webp)

