'పవర్‌స్టార్' ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
on Jul 9, 2020
గురువారం ఉదయం తన 'పవర్‌స్టార్' మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తానని చెప్పిన రామ్‌గోపాల్ వర్మ అందుకు తగ్గట్లే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా కాల్సనిక చిత్రమనీ, నిజ జీవితంలోని మనుషులతో ఏవైనా పోలికలుంటే అది కేవలం కాకతాళీయమేనని ఆయన ఎప్పటిలాగే ఎస్కేప్ అయ్యారు. ఈ ఫస్ట్‌లుక్‌లో బ్లాక్ డ్రస్ ధరించిన ఆర్జీవీ పవర్‌స్టార్, నోటిపై చేయివేసుకు కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నాడు. "ఎన్నికల ఫలితాల తర్వాత కథ" అని తనదైన శైలి వ్యంగ్య ధోరణిలో ఈ సినిమా పోస్టర్‌పై క్యాప్షన్ రాశారు వర్మ.
ఆ తర్వాత మరో గంటకు ఆర్జీవీ ఆ సినిమాలోని ఒక ఇమేజ్ను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వరా షేర్ చేశారు. ఆ ఫొటోకు "నా ఫిల్మ్ 'పవర్‌స్టార్' నుంచి ఒక సన్నివేశంలో ఇద్దరు అన్నదమ్ములు" అంటూ కాప్షన్ పెట్టారు. అందులో ఆ అన్నదమ్ములిద్దరూ సోఫాలో కూర్చొని ఉన్నారు. టైటిల్ పాత్రధారి తెల్లటి పైజమా కుర్తా ధరించి చేత్తో జుట్టుపట్టుకొని అసహనంగా ఉన్నట్లు కనిపిస్తుంటే, అతని వంకే చూస్తూ కూర్చున్నాడు అతని బ్రదర్. అతని రూపం మెగాస్టార్‌ను గుర్తు చేస్తూ ఉండటం గమనార్హం.
ఆపైన మరో 'పవర్‌స్టార్' ఫొటోను షేర్ చేశారు వర్మ. "పవర్‌స్టార్‌లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న యాక్టర్ నేను చూసిన ఏ స్టార్ కంటే కూడా మరింత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు" అని రాసుకొచ్చారు. ఈ ఫొటోలో టైటిల్ పాత్రధారి తెల్లటి వస్త్రాల్లో నిల్చొని ఆలోచనా సాగరంలో నిమగ్నమై ఉన్నాడు.