
ఆదివారం రోజు విజయవాడలో వర్మ ప్రెస్ మీట్ రద్దవ్వడంతో ఈ రోజు (సోమవారం) హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ కార్యక్రమంలో తీవ్రంగా ఆయన స్పందిస్తూ... నిజంగా విజయవాడలో నన్ను ప్రెస్ మీట్ పెట్టుకోనివ్వకపోవడం చాలా దారుణం. మేమేదో టెర్రరిస్ట్ ల్లా ప్రవర్తించాం అన్నట్టుగా వర్మ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీసం విజయవాడలో తాము ఉండటానికి కూడా అంగీకరించలేదని పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తనకు సెకండరీ.. నాకు జరిగిన అవమానం నన్ను షాక్ కు గురించేసిందన్నారు.
ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైంది. కొత్తగా మాట్లాడటానికి విజయవాడలో ఏముంది? ఏం మాట్లాడతానని పోలీసులు భయపడుతున్నారు? నన్ను అడ్డుకొమ్మని ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలి. ఎయిర్ పోర్ట్ లోకి పోలీసులు ఎలా వచ్చారు? ప‌్రెస్ మీట్స్ పెట్టుకునే ఫ్రీడమ్ మాకు లేదా? నన్ను ఏపీకి రావొద్దని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏమైనా నార్త్ కొరియానా? వీసా తీసుకుని అక్కడికి వెళ్లాలా? అంటూ ప్రశ్నించారు. ఎల్లుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో విడుదల కానుంది అని మీడియాకు వివరించారు ఆర్జీవి.
ఇంకా ఆయన మాట్లాడుతూ...``నన్ను బలవంతంగా విమానం ఎక్కించి హైదరాబాద్ కు ఎందుకు పంపారు? అసలు ఇలా చేయమని ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అని అడిగితే ఏ ఒక్క అధికారి ఆన్సర్ చెప్పడం లేదు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక నియంతృత్వ రాజ్యంలో ఉంటున్నామా? అనే అనుమానం వస్తోంది. జగన్ కోడి కత్తి దాడి అప్పుడు రాని పోలీసులు ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లోపలికి రావడానికి అధికారం ఎలా వచ్చింది. కనీసం మా ఫ్రెండ్ ఇంట్లో కూడా మీడియా సమావేశం పెట్టుకోవడానికి కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చెప్పుకొచ్చారు వర్మ. నిన్నటి షాక్ నుంచి తేరు కోలేక పోతున్నా అంటూ వ్యాఖ్యానించారు.





.jpg)
