ఫ్యాన్స్ కోసం సంక్రాంతికి గిఫ్ట్ రెడీ చేస్తున్నరామ్ చరణ్!
on Dec 28, 2022

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటించిన రామ్ చరణ్ కు పాన్ వరల్డ్ రేంజ్ లో అద్భుతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈ చిత్రంలో ఆయన నటనకు గాను ఉత్తమ కథానాయకుడు అవార్డు కోసం ఆస్కార్ లెవల్లో పోటీ పడుతున్నాడు. ఈ చిత్రానికి ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా ఎన్టీఆర్ పేరును పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు పలు అంతర్జాతీయ పురస్కారాలు లభిస్తున్నాయి. ఇక రాంచరణ్ కు ఆస్కార్ వస్తుందో లేదో తెలీదుగానీ రాజమౌళి చిత్రాల తర్వాత కచ్చితంగా ఫ్లాప్ వస్తుందనే బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం ఇప్పటికే చాలా సార్లు నిరూపితమైంది. ఆయన తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివా దర్శకత్వంలో నటించిన ఆచార్య డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆయనకు ఆ అపశకునం తొలగిపోయింది. ఇప్పటికే తనకు ఏకంగా దేశ విదేశాలలో మంచి ఇమేజ్ రావడంతో ఈసారి ఆయన ఆచితూచి దేశం గర్వించదగ్గ దర్శకుడు, డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్నాడు. చాలా నెలల నుండి ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే న్యూజిలాండ్ లో ఓ పాటను చిత్రీకరించిన శంకర్ ప్రస్తుతం గోదావరి తీరంలో పొలిటికల్ సీన్స్ ను పొలిటికల్ మీటింగ్ సన్నివేశాలను చిత్రీకరించడంలో బిజీగా ఉన్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన కనీసం ఒకట్రెండు అప్డేట్స్‌ను కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించకపోవడంతో రాంచరణ్ ఫ్యాన్స్ మూవీ యూనిట్ పై మండిపడుతున్నారు. ట్విట్టర్లో అయితే చాలాసార్లు ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజుపై నెగటివ్ హాష్ ట్యాగ్ తో ట్రెండ్ కూడా చేశారు. దిల్ రాజు ఈ ట్రెండ్స్ కు స్పందిస్తూ నేను కూడా మీలానే ఎదురుచూస్తున్నాను. కానీ నా చేతుల్లో ఏమీ లేదు... శంకర్ సార్ మాత్రమే ఖరారు చేయాలి. కాస్త ఓపిక పట్టండి... అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు. కానీ ఆయన చెప్పి దాదాపు 6 నెలలు దాటింది. సోషల్ మీడియాలో లీక్ అయ్యే ఫోటోలతోనే సరి పెట్టుకోవాల్సి వస్తుంది తప్ప మూవీ టీం నుండి అధికారికంగా ఫస్ట్ లుక్ గాని టైటిల్ గాని ఇప్పటివరకు రాలేదు. అభిమానులు అప్డేట్ కోసం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ని ట్యాగ్ చేసి రోజు తిడుతూనే ఉన్నారు. కానీ యూనిట్ నుండి ఎలాంటి స్పందన లేదు. అయితే ఇకనుండి రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్ళను తిట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన న్యూ ఇయర్ రోజు స్వయంగా రామ్ చరణ్ తెలియజేస్తాడట.
అలా ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ నుండి తీపి కబురు అందించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. చిన్న రామ్ చరణ్ కు కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి పెద్ద రామ్ చరణ్ కి భార్య పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకై తెగ వైరల్ గా మారాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు, దర్శకుడు ఎస్.జె. సూర్యా మెయిన్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు అయితే శంకర్ చిత్రాలంటే అవి ఎప్పుడు విడుదలతాయో కచ్చితంగా చెప్పలేం. మరి వేసవి కానుకగా అయినా శంకర్ చిత్రం విడుదలై రామ్ చరణ్ అభిమానులకు సంతోషాన్ని కలుగజేస్తుందని ఆశిద్దాం!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



