
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఇరుముడి’ (Irumudi). ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాకు సంబంధించిన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' (The Heart of Irumudi) ప్రత్యేక గ్లింప్స్‌ను జూన్ 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో రవితేజతో పాటు ఒక చిన్న పాప ఒక గోడపై వెనుకకు తిరిగి కూర్చుని ఉన్న విజువల్స్ కనిపిస్తున్నాయి. కొండల నేపథ్యంలో ఉన్న ఈ పిక్చర్ సినిమాలోని ఎమోషనల్ యాంగిల్‌ను ఎలివేట్ చేస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు గుండెకు హత్తుకునే ఎమోషన్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
శివ నిర్వాణ గతంలో క్లాస్ మరియు ఎమోషనల్ హిట్స్ అందించగా, రవితేజ తనదైన ఎనర్జీతో మాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘ఇరుముడి’ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 3న రాబోయే గ్లింప్స్ సినిమా కథాంశంపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ గ్లింప్స్ కోసం మాస్ మహారాజా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.






