'మానాడు' రీమేక్ లో రవితేజ, సిద్ధు జొన్నలగడ్డ!
on Oct 16, 2022

ఇప్పటికే తెలుగులో డబ్ అయిన ఇతర భాషలకు చెందిన హిట్ సినిమాలను మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడం చూస్తున్నాం. 'వీరం'ను 'కాటమరాయుడు'గా పవన్ కళ్యాణ్, 'లూసిఫర్'ని 'గాడ్ ఫాదర్'గా చిరంజీవి అలాగే రీమేక్ చేశారు. ఇప్పుడు రవితేజ కూడా అదే బాటలో పయనించనున్నాడని తెలుస్తోంది.
శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన తమిళ్ సినిమా 'మానాడు'. గతేడాది నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం తమిళ్ లో ఘన విజయం సాధించింది. ఆ సమయంలో ఈ చిత్రం తెలుగు డబ్ వెర్షన్ ని థియేటర్స్ లో విడుదల చేయాలనుకుని, రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో చివరి నిమిషంలో ఆపారు. ఈ చిత్ర తెలుగు రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఓటీటీలో ఇప్పటికే తెలుగు డబ్ వెర్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
తమిళ్ లో శింబు, ఎస్.జె.సూర్య పోషించిన పాత్రలను తెలుగులో మాస్ మహారాజ రవితేజ, యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ పోషించనున్నారని సమాచారం. దశరథ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ స్క్రిప్ట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. రీమేక్ స్క్రిప్ట్ లను తెలుగు ఆడియన్స్ మెచ్చేలా మలచడంలో హరీష్ దిట్ట. 'దబాంగ్'ను 'గబ్బర్ సింగ్'గా, 'జిగర్తాండ'ను 'గద్దలకొండ గణేష్'గా మలిచి హిట్స్ కొట్టాడు హరీష్. అయితే ఈసారి దర్శకుడిగా కాకుండా, కేవలం రచయితగానే 'మానాడు' రీమేక్ కి వర్క్ చేస్తున్నట్లు టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



