ఇప్పటివరకు రష్మిక మందన్న అంటే గ్లామర్, క్యూట్‌నెస్, మోడ్రన్ లుక్ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఆమెను చూస్తే మాత్రం ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గుర్తొస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’లో రష్మిక.. సుబ్బులక్ష్మి పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కనిపించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సుబ్బులక్ష్మి ప్రత్యేకతగా నిలిచిన నీలిరంగు పట్టుచీరను రష్మిక కూడా ధరించారు. సంప్రదాయ ఆభరణాలు, కాసుల పేరు, జుమ్కాలు, ముక్కుపుడక, వెనక్కి చక్కగా వేసిన కొప్పు, మల్లెపూలతో ఆమెను పాతకాలం నాటి సంగీత విద్వాంసురాలిలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ‘ఎంఎస్ బ్లూ’గా గుర్తింపు తెచ్చుకున్న నీలిరంగు చీర ఈ లుక్‌కు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. కేవలం ఓ చీర కట్టుకోవడం మాత్రమే కాకుండా.. పాత్రకు తగ్గట్టుగా ప్రతి చిన్న అంశాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నట్టు ఈ మేకోవర్ చూస్తే అర్థమవుతోంది.
ఇక మరో సందర్భంలో రష్మిక డార్క్ మెరూన్ చెక్స్ పట్టుచీరలో చాలా సింపుల్‌గా కనిపించారు. చిన్న కమ్మలు, ముక్కుపుడకతో సంప్రదాయ భారతీయ మహిళలా కనిపించిన ఆ లుక్ కూడా ఆకట్టుకుంది. ఈ పాత్ర కోసం రష్మిక కేవలం లుక్ విషయంలోనే కాకుండా నటనలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సుబ్బులక్ష్మి పాత్రలో సహజత్వం కోసం ఆమె కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. సినిమాలో ఆమె స్వయంగా పాటలు పాడే అవకాశాన్ని కూడా మేకర్స్ పరిశీలించినట్టు తెలుస్తోంది.
మరోవైపు సెప్టెంబర్‌లో జరిగిన సినిమా లాంచ్ కార్యక్రమంలోనూ రష్మిక.. సుబ్బులక్ష్మి ఐకానిక్ నీలి చీర లుక్‌లోనే కనిపించారు. ఆ సందర్భంగా ఆమె ఈ పాత్ర దక్కడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, తన వంతు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. కమల్ హాసన్ సైతం సుబ్బులక్ష్మి వంటి దిగ్గజాన్ని తెరపై పోషించడం ఎంతో పెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటికే ఈ బయోపిక్‌పై ఆసక్తి నెలకొనగా.. రష్మిక మేకోవర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
[Rashmika Mandanna, MS Subbulakshmi Biopic, Rashmika MS Subbulakshmi, MS A Legacy On Screen, Rashmika Makeover, Rashmika Saree Look, MS Subbulakshmi Blue Saree, Gowtam Tinnanuri, Anirudh Ravichander, Telugu Cinema News]






