ENGLISH | TELUGU  

‘రామబాణం’ మూవీ రివ్యూ

on May 5, 2023

 

సినిమా పేరు: రామబాణం
తారాగణం: గోపీచంద్, జగపతిబాబు, కుష్బూ, డింపుల్ హయాతి, నాజర్, శుభలేఖ సుధాకర్, తరుణ్ అరోరా, కృష్ణన్, దినేశ్, సచిన్ ఖడేకర్, గెటప్ శ్రీను, సత్యా, సప్తగిరి, వెన్నెల కిశోర్, అలీ, రాజా రవీంద్ర, సమీర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ నరేశ్, రజిత
కథ: భూపతి రాజా
మాటలు: మధుసూదన్ పడమటి
మ్యూజిక్: మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైన్: కిరణ్ కుమార్ మన్నే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీవాస్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 5 మే 2023

'లక్ష్యం', 'లౌక్యం' లాంటి హిట్ మూవీస్ తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో 'రామబాణం' చిత్రంపై సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. పైగా 'లక్ష్యం'లో అన్నదమ్ములుగా నటించి ఆకట్టుకున్న జగపతిబాబు, గోపీచంద్ ఇందులోనూ అన్నదమ్ములుగా నటించడం సినీ గోయర్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఆ 'రామబాణం' ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది.

కథ
సుఖీభవ అనే హోటల్‌ను నడిపే రాజారాం (జగపతిబాబు) స్వచ్ఛమైన ఆహారాన్ని జనానికి అందివ్వాలని ఆశిస్తుంటాడు. స్వతహాగా అతను సాత్వికుడు. అన్నంటే భక్తి ఉన్నప్పటికీ దెబ్బకు ఎదురుదెబ్బ తియ్యడమే కరెక్టనే మనస్తత్వం ఉన్నవాడు అతని తమ్ముడు విక్కీ. ఫలితంగా కుర్రాడిగా ఉన్నప్పుడే అన్న మాటకు విరుద్ధంగా ఇల్లొదిలి కలకత్తాకు పారిపోయి, అక్కడ విక్కీ దాదా (గోపీచంద్)గా మారతాడు. భైరవి అనే యూట్యూబర్‌తో ప్రేమలో పడతాడు. 'ప్రేమించుకోడానికి మీరిద్దరూ చాలు, కానీ పెళ్లి చేసుకోడానికి రెండు కుంటుబాలు కలవాలి' అని భైరవి తండ్రి శుక్లా (సచిన్ ఖడేకర్) అనడంతో 14 యేళ్ల తర్వాత అన్న దగ్గరకు వస్తాడు విక్కీ. అప్పటికే రఘునాథపురం అనే ఊరినుంచి హైదరాబాద్‌లోని బృందావన్ కాలనీకి మకాం మార్చివుంటాడు రాజారాం. ఫుడ్ కమీషన్ చైర్మన్ అయిన అతనికి మామా అల్లుళ్లు పాపారావు (నాజర్), జీకే (తరుణ్ అరోరా) నుంచి హాని ఉంటుంది. ఈ విషయాన్ని తమ్ముడికి చెప్పకుండా దాచిపెడతాడు. ఇటు విక్కీ సైతం కలకత్తాలో తానేం చేస్తున్నాడో అన్నకు చెప్పలేడు. ఇలాంటి స్థితిలో అన్న ప్రమాదంలో విషయం విక్కీకి తెలుస్తుంది. అన్నను అతను ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ
మంచి బంధాలు, స్వచ్ఛమైన ఆహారం.. ఇవే ఆనందకరమైన జీవితానికి శ్రీరామరక్ష అనే సూత్రం మీద భూపతి రాజా ఈ సినిమా కథను అందిస్తే, స్క్రీన్‌ప్లే తనే స్వయంగా రాసుకున్నాడు శ్రీవాస్. పాత సీసాలో పాత సారా టైపు కథకు అలాంటి కథనమే తోడయ్యింది. భిన్న మనస్తాత్వాలున్న అన్నదమ్ముల కథను ఎన్ని వందల సినిమాల్లో చూసివుంటాం. స్వచ్ఛమైన ఆహారం, సేంద్రియ వ్యవసాయం అనే అంశాలు జోడించినంత మాత్రాన పాతకథకు కొత్తదనం అంటదు. సన్నివేశాల్లో ఏమైనా కొత్తదనం ఉండాలి, ప్రభావవంతమైన సంభాషణలు తోడవ్వాలి, సూపర్ అనిపించే క్యారెక్టరైజేషన్స్ కావాలి. సెంటిమెంట్ సీన్లలో సహజత్వం ఉట్టిపడాలి, భావోద్వేగాల్లో నిజాయితీ కనిపించాలి. 'రామబాణం' సినిమాలో ఇవన్నీ బలంగా లేవు. అన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. రామబాణం అంటే రాముడు వదిలిన బాణం కదా.. ఇందులో జగపతిబాబు, గోపీచంద్ చేసిన రాజారాం, విక్కీ పాత్రలు రామలక్ష్మణులు అనుకుంటే.. విక్కీ అనేవాడు రాజారాం వదిలిన బాణం కావాలి. కానీ కథలో అలాంటిదేమీ లేదు. అతడు వదలకుండానే తానే ఒక బాణంలా అన్న కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తాడు విక్కీ. కలకత్తాలో విక్కీ ఏం చేసేవాడో తెలిశాక అతడ్ని దూరం పెడతాడు రాజారాం. అతనెప్పుడూ విక్కీని రామబాణంలా శత్రువుల మీదకు ఎక్కుపెట్టలేదు. 

క్యారెక్టరైజేషన్స్ విషయంలోనూ శ్రీవాస్ ఎక్కువ శ్రద్ధపెట్టలేదు. మొదట్నుంచీ భర్త చాటు గృహిణిలా కనిపించిన భువనేశ్వరి (కుష్బూ), ప్రి క్లైమాక్స్‌లో మరిది విక్కీ చేయిపట్టుకొని ఆవేశభరితంగా విలన్ ఇంటికి వెళితే, ఆమెకి కూడా ఏదైనా బలమైన నేపథ్యం ఉందేమోనని ఊహిస్తాం.. కానీ అలాంటిదేమీ లేదని తెలిసి ఉస్సూరుమంటాం. టీనేజ్‌లో ఉన్న విక్కీ అన్న చెప్పిన మాట వినకుండా పారిపోవడమే కృతకంగా ఉందనుకుంటే, భువనేశ్వరి ఓవరాక్టింగ్ సీన్ అంతకంటే ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. జయప్రకాశ్ అనే పేరున్న నటుడు ఒక సీన్‌లో ఇలా కనిపించి అలా మాయమవుతాడు. అతను మళ్లీ ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురుచూసినవాళ్లకు ఆశాభంగం తప్పదు. 

"నిద్రపోతున్న ఉడతను లేపారు.. చూస్తాను" అని గోపీచంద్ బ్యాచ్ (గెటప్ శ్రీను, సత్యా) మీద ఆవేశంగా ఊగిపోయిన కమెడియన్ సప్తగిరి ఆ మాట తర్వాత ఏమైపోయాడో మనకు తెలీదు. అన్నదమ్ములు మళ్లీ కలవడానికి కారణమైన భైరవి, తన క్యారెక్టర్ పని అంతవరకే అన్నట్లు మిన్నకుండిపోయింది. రాజారాం ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే, అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోయేవాడల్లా చేయి కడిగేసుకొని, ఒక్కడే బయటకు వెళ్లిపోతాడు విక్కీ. ఆ ఇంట్లోనే ఉన్న అతని అసిస్టెంట్లు ఏమైపోయారు? సినిమా అంతా నున్నటి షేవ్‌తో కనిపించిన గోపీచంద్, హీరోయిన్‌తో డ్యూయెట్లలో మాత్రం గడ్డంతో ఎందుకు కనిపించాడు?.. ఇలాంటి జవాబు దొరకని సీన్లు చాలానే 'రామబాణం'లో ఉన్నాయి. 

అయితే అప్పుడప్పుడు కొన్ని ఆకట్టుకొనే సన్నివేశాలు కూడా వచ్చిపోతుంటాయి కాబట్టి, మనం మరీ అంత డీలా పడాల్సిన అవసరం లేదు. సెంటిమెంట్ సీన్లు కొన్ని బాగానే పండాయి. అన్న కుటుంబాన్ని తమ్ముడు ఆదుకొనే సీన్లు అలరిస్తాయి. అయితే వెన్నెల కిశోర్, అలీ, సత్యా, గెటప్ శ్రీను, సప్తగిరి లాంటి కమెడియన్లు ఉన్నా హాస్యం సరిగా పండకపోవడం మైనస్. వెన్నెల కిశోర్, జబర్దస్త్ నరేశ్ జోడీ సీన్లు ఏమాత్రం నవ్వించలేదు. గెటప్ శ్రీను, సత్యాపై సీన్లు పరమ రొటీన్ అనిపించాయి. అలీ, సప్తగిరి కూడా అంతే. 

మధుసూదన్ పడమటి సంభాషణలు అడపాదడపా మాత్రమే ఇంప్రెసివ్‌గా అనిపించి, ఎక్కువసార్లు రోటీన్‌గా నడిచాయి. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ మాత్రం బాగానే ఉంది. సన్నివేశాలకు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అతను పాటలకు కూడా వినసొంపైన బాణీలు అందించాడు. పాటల చిత్రీకరణ ఫర్వాలేదు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ చాలా క్వాలిటీగా అనిపించింది. సన్నివేశాల్లోని మూడ్‌కు తగ్గట్లు కెమెరా పనిచేసింది. కొన్ని పాత్రలు అర్ధంతరంగా ఆగిపోవడాన్ని ఎడిటర్ ప్రవీణ్ పూడి గుర్తించలేకపోయాడు. రొటీన్ సీన్లను ఎలా ఆసక్తికరంగా కూర్చాలో అతనికి తెలీలేదు. కిరణ్ కుమార్ ఆర్ట్ వర్క్ చక్కగా ఉంది.

నటీనటుల పనితీరు
విక్కీ పాత్రలో గోపీచంద్ బాగున్నాడు, చక్కగా రాణించాడు. తన ఇమేజ్‌కు తగ్గట్లే యాక్షన్ సీన్లలో చెలరేగిపోయాడు. ఎమోషనల్ సీన్లను పండించాడు. జగపతిబాబు ఎప్పట్లా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ చూపించాడు. రాజారాం పాత్రలో ఇట్టే ఇమిడిపోయాడు. భువనేశ్వరి పాత్రలోకి కుష్బూ చులాగ్గా పరకాయప్రవేశం చేశారు. భైరవిగా డింపుల్ హయాతికి నటించడానికి ఎక్కువ అవకాశం ఇవ్వలేదు దర్శకుడు. పాటల్లో తగినంత ఒంపుసొంపులు ప్రదర్శించింది. విలన్ రోల్స్‌లో నాజర్, తరుణ్ అరోరా, కృష్ణన్, దినేశ్ కనిపించారు. వెన్నెల కిశోర్, సప్తగిరి, అలీ, సత్యా, గెటప్ శ్రీను నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు ఎక్కువగా ఫలించలేదు. రాజారాం కుటుంబాన్ని అంటిపెట్టుకొని ఉండే సూర్యనారాయణగా శుభలేఖ సుధాకర్ ఆకట్టుకున్నారు. సచిన్ ఖడేకర్, రాజా రవీంద్ర, సమీర్, కాశీ విశ్వనాథ్ లాంటి వాళ్లు కూడా ఇందులో ఉన్నారు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్
పరమ రొటీన్ స్టోరీ, సాధారణ కథనం, గొప్పగా లేని క్యారెక్టరైజేషన్స్, నవ్వించని కమెడియన్లు ఉన్న 'రామబాణం'లో ఆకట్టుకొనేవి ఏమైనా ఉన్నాయీ అంటే అవి.. అన్నదమ్ముల అనుబంధం, ఆ అన్నదమ్ముల పాత్రల్లో జగపతిబాబు, గోపీచంద్ నటన, గోపీచంద్ చేసిన యాక్షన్ సీన్లు. 'మనమేం తింటామో అదే మనం' అనే ఒక గొప్ప విషయాన్ని చాలా సాదాసీదాగ చెప్పిన సినిమా.. రామబాణం.

రేటింగ్: 2.5/5

- బుద్ధి యజ్ఞమూర్తి 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.