Home

»

Latest News

ఆర్జీవీ, ఊర్మిళ సీక్రెట్ మ్యారేజ్‌, లీక్ చేసిన చిరంజీవి.. జ‌ర్న‌లిస్ట్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.!

Aug 4, 2026 5:12PM

డైరెక్టర్ రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మేకింగ్ విప్లవం ఒకెత్తయితే, ఆయన పర్సనల్ లైఫ్, సంచలన వ్యాఖ్యలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటాయి. అయితే తాజాగా ఆర్జీవీకి సంబంధించిన ఒక అత్యంత షాకింగ్, నమ్మలేని పర్సనల్ సీక్రెట్ నెట్టింట విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఒకప్పటి బాలీవుడ్ అండ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్‌ను రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ రహస్యంగా వివాహం చేసుకున్నారని, ఈ విషయాన్ని స్వయంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవే లీక్ చేశారనే వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఇటీవల సిద్ధార్థ్ కన్నన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ సంచలన విషయాలను బయటపెట్టారు.

జ్యోతి వెంకటేష్ కథనం ప్రకారం.. గతంలో ఆయన ఒకసారి మెగాస్టార్ చిరంజీవిని కలిసినప్పుడు, చిరు సరదాగా సంభాషిస్తూ "హేయ్ జ్యోతి... నువ్వు అన్ని వార్తలు రాస్తావు కానీ, ఊర్మిళను రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న విషయం ఎందుకు రాయలేదు?" అని అడిగారట. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన జర్నలిస్ట్, వారిద్దరికీ అసలు పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరిగింది అని చిరంజీవిని ఆరా తీశారు. దానికి సమాధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రముఖ దేవాలయానికి ఊర్మిళను తీసుకెళ్లి ఆర్జీవీ రహస్యంగా తాళి కట్టారని చిరంజీవి చెప్పినట్లు జర్నలిస్ట్ వెల్లడించారు. అంతేకాకుండా, ఈ వార్త నిజమేనని నమ్మడానికి ప్రామాణికంగా వారి పెళ్లి జరిపించిన ఆలయ పూజారి ఫోన్ నంబర్‌ను కూడా చిరంజీవే స్వయంగా తనకిచ్చారని జ్యోతి వెంకటేష్ ఆ పాడ్‌కాస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంపై ఆర్టికల్ పబ్లిష్ చేయడానికి ముందే స్పష్టత కోసం జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ నేరుగా హీరోయిన్ ఊర్మిళకే ఫోన్ చేశారు. ఆ వార్త వినగానే ఊర్మిళ తీవ్ర భావోద్వేగానికి లోనై ఏడుస్తూ, "నా గురించి మీరు అలా ఎలా రాస్తారు? నేను పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు కదా" అంటూ ఆ వార్తను ఖండించారు. ఇక ఇదే విషయంపై డైరెక్టర్ రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ను సంప్రదించగా, ఆయన ఎప్పటిలాగే తన మార్క్ స్టైల్‌లో "నో కామెంట్స్" అని సమాధానమిచ్చారు. దీంతో జర్నలిస్ట్ ఇద్దరి వర్షన్లను పేర్కొంటూ అప్పట్లో ఆ కథనాన్ని ప్రచురించారు. ప్రస్తుతం ఈ పాడ్‌కాస్ట్ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ రహస్య వివాహ రూమర్‌పై ఇప్పటివరకు అటు ఊర్మిళ గానీ, ఇటు ఆర్జీవీ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

సినిమా విషయానికొస్తే, అప్పట్లో ఆర్జీవీ - ఊర్మిళల కాంబినేషన్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ఐకానిక్ ట్రెండ్ సృష్టించింది. వీరి కాంబోలో వచ్చిన గాయం, అంతం, రంగీలా, సత్య, దౌడ్ వంటి దాదాపు 5 కంటే ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సంచలన విజయాలు సాధించాయి. ఊర్మిళను ఇండియన్ స్క్రీన్ పై అత్యంత గ్లామరస్‌గా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో చూపించిన ఘనత ఆర్జీవీకే దక్కుతుంది. ఆ తర్వాత కాలంలో ఊర్మిళ 2016 లో వ్యాపారవేత్త మోహ్సిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకున్నారు. అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ 8 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత 2024 లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఊర్మిళ సింగిల్‌గానే ఉంటున్నారు. మరోవైపు చిరంజీవి లీక్ చేశారంటూ సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన ఆర్జీవీ సీక్రెట్ మ్యారేజ్ ఉదంతం మాత్రం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Ram Gopal Varma Urmila Matondkar marriage, RGV Urmila secret wedding, Chiranjeevi RGV Urmila leak, RGV Urmila movies, Jyoti Venkatesh podcast RGV, Tollywood cinema news

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com