మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి సినిమా ‘మగధీర’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌పై జరిగిన ఒక ఆసక్తికరమైన, ఫన్నీ విషయాన్ని కాజల్ తాజాగా పంచుకున్నారు. షూటింగ్ విరామ సమయంలో రామ్ చరణ్ తనను ఎలా సరదాగా ఆటపట్టించేవారో గుర్తు చేసుకుంటూ ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో గుర్రపు స్వారీకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ షూటింగ్ కోసం రామ్ చరణ్ తన సొంత గుర్రమైన ‘బదల్’ను లొకేషన్‌కు తీసుకువచ్చేవారట. షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా తనను ఆ గుర్రంపై ఎక్కించి కాసేపు సరదాగా తిప్పడం ఒకెత్తయితే, ఆ తర్వాత చరణ్ చేసే అల్లరి మరో ఎత్తు అని కాజల్ వివరించారు.
సెట్స్ లో తాను ఎప్పుడు కనిపించినా రామ్ చరణ్ తన గుర్రం పేరును గుర్తు చేస్తూ “బదల్... బదల్...” అని గట్టిగా అరుస్తూ తనను తెగ ఆటపట్టించేవారని చందమామ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చరణ్ చేసిన కొన్ని ఫన్నీ కామెంట్లు, నవ్వించిన విధానం ఇప్పటికీ తన మదిలో అలాగే నిలిచిపోయాయని ఆమె ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
మగధీర లాంటి ఒక భారీ హిస్టారికల్ పీరియడ్ సినిమా చేస్తున్నప్పుడు నటీనటులపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ, అంతటి భారీ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతున్నా రామ్ చరణ్ మాత్రం లొకేషన్‌ను ఎప్పుడూ చాలా సరదాగా, ఆహ్లాదకరంగా ఉంచేవారని కాజల్ పేర్కొన్నారు. ఈ విషయాలు తెలుసుకున్న మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మన చరణ్ లొకేషన్ లో చాలా కూల్ గా ఉంటాడంటూ మురిసిపోతున్నారు.
ఇక కెరీర్ పరంగా చూస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం తన తాజా చిత్రం 'పెద్ది' ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.





