మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గుణగణాలపై చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ పాజిటివ్ టాక్ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సెట్స్లో తోటి నటీనటులతో ప్రవర్తించే తీరు, ఇచ్చే గౌరవం అద్భుతమని చాలా మంది చెబుతుంటారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి సైతం చరణ్ సంస్కారాన్ని కొనియాడారు. చరణ్ రాబోయే భారీ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా మెగాఫోన్ పట్టిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ది’ సినిమా విడుదలకు అటుఇటుగా తమ సినిమా కూడా థియేటర్లలోకి రానుందని, అయితే చరణ్ సినిమా పెద్ద హిట్ కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా రామ్‌చరణ్‌తో కలిసి తాను నటించిన సూపర్ హిట్ చిత్రం ‘నాయక్’ నాటి ఒక అపురూపమైన సంఘటనను పోసాని గుర్తుచేసుకున్నారు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో చరణ్ పక్కన పోసాని చేసిన కామెడీ ట్రాక్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. కొన్ని సీన్లలో హీరో కంటే తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత లభించిందని, స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా దక్కిందని పోసాని పేర్కొన్నారు.
సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా తనను డామినేట్ చేసేలా సీన్లు ఉంటే ఈగో ఫీలవుతారని, కానీ చరణ్ మాత్రం ఎంతో గొప్పగా ప్రవర్తించారని పోసాని అన్నారు. ఆ సమయంలో చరణ్ తనను ప్రత్యేకంగా పిలిచి.. "పోసాని గారు.. నాన్న సినిమా చూశారు. మీ సీన్లు థియేటర్లలో బాగా పేలుతాయని చెప్పారు. మీ ఉన్న ఒక్క సీన్ కూడా ఎడిటింగ్‌లో తీసేయొద్దని నాన్న ఆర్డర్ వేశారు" అని ఎంతో సంతోషంగా చెప్పినట్లు పోసాని వెల్లడించారు.
తోటి నటీనటుల ప్రతిభను అంతలా గౌరవించే గొప్ప మనసు, సంస్కారం రామ్ చరణ్ కి ఉన్నాయని పోసాని ప్రశంసించారు. అందుకే అంత మంచి వ్యక్తి నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోసాని ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’తో పాటు చరణ్ ‘పెద్ది’ కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.






