Home

»

Latest News

Peddi: రామ్ చరణ్ 'పెద్ది' రికార్డుల వేట.. ఓవర్సీస్‌లో ఊచకోత!

May 22, 2026

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సరికొత్త రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. 

నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. కేవలం అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే ఈ చిత్రం ఇప్పటికే 15,000 కంటే ఎక్కువ టిక్కెట్లను విక్రయించి సంచలనం సృష్టించింది. నార్త్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 467 లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఇప్పటివరకు ఏకంగా $430,000 డాలర్ల (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.4 కోట్లు) గ్రాస్ వసూళ్లను సాధించి అదరగొట్టింది. ఇందులో కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి ప్రధాన రాష్ట్రాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. అక్కడి తెలుగు ప్రేక్షకులు చరణ్ మాస్ అవతారాన్ని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కేవలం అమెరికాలోనే కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మార్కెట్లో కూడా ‘పెద్ది’ హవా గట్టిగానే నడుస్తోంది. యూకేలో ఇప్పటికే 7,500 కంటే ఎక్కువ టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అమ్ముడయ్యాయి. 

సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఈ స్థాయి రెస్పాన్స్ రావడం చూస్తుంటే, రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓవర్సీస్ ఓపెనర్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పవర్ ఫుల్ ఎమోషనల్ జర్నీలో రామ్ చరణ్ ఊరమాస్ పహిల్వాన్ లుక్, అలాగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన సంగీతం, ఇటీవల విడుదలైన సెన్సేషనల్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com