
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఒక అరుదైన, హృదయాన్ని హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. ఒక వీరాభిమాని చరణ్‌ను కలవడానికి పడ్డ ఆరాటం, దానికి మెగా హీరో స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ వేడుక జరుగుతున్న సమయంలో ఒక డైహార్డ్ ఫ్యాన్ సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని నేరుగా రామ్ చరణ్ దగ్గరకు దూసుకొచ్చాడు. చరణ్‌ను చూడగానే ఆనందంతో భావోద్వేగానికి లోనైన ఆ అభిమాని, ఒక్కసారిగా మెగా పవర్‌స్టార్ కాళ్ళపై పడిపోయి గట్టిగా పట్టుకుని ఏడవడం ప్రారంభించాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి, ఆ అభిమానిని పక్కకు లాగేందుకు ప్రయత్నించారు.
అయితే, రామ్ చరణ్ మాత్రం సెక్యూరిటీని వారించారు. ఆ అభిమానిని పక్కకు తోసేయకుండా, ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. కిందపడి ఏడుస్తున్న అతడిని స్వయంగా చేతులతో పైకి లేపి, ఓదార్చారు. అంతటితో ఆగకుండా ఆ అభిమానిని ఆత్మీయంగా కౌగిలించుకుని, బుజ్జగిస్తూ మాట్లాడారు. దాంతో ఆ ఫ్యాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ చూపించిన ఈ గొప్ప మనసును, ఆయన డౌన్-టు-ఎర్త్ స్వభావాన్ని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.





