తీవ్ర నిరాశలో రామ్ చరణ్ ఫ్యాన్స్!
on Nov 29, 2023
ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ ఇతర స్టార్ హీరో ఫ్యాన్స్ లేనంత నిరాశలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు. 'గేమ్ ఛేంజర్' ఎప్పుడు పూర్తవుతుందో, తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియక అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
'ఆర్ఆర్ఆర్' సమయంలో రామ్ చరణ్ ఫుల్ దూకుడు చూపించాడు. 'ఆర్ఆర్ఆర్' విడుదల కాకముందే 'ఆచార్య'ను పూర్తి చేశాడు, 'గేమ్ ఛేంజర్'ను ప్రకటించాడు. దీంతో చరణ్ ప్లానింగ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఆ ఖుషి నిరాశగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత వచ్చిన 'ఆచార్య' ఘోర పరాజయం పాలైంది. అలాగే 'ఇండియన్-2' కారణంగా 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది?, కనీసం వచ్చే ఏడాదైనా సినిమా విడుదలవుతుందా? అనే దానిపై క్లారిటీ లేదు.
మరోవైపు చరణ్ తన తదుపరి సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రకటించాడు. ఈలోపు ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ చేద్దామంటే దానికోసం చరణ్ స్పెషల్ గా మేకోవర్ కావాల్సి ఉంది. ఒకసారి మేకోవర్ అయితే ఆ షూటింగ్ పూర్తయ్యేవరకు లుక్ కారణంగా 'గేమ్ ఛేంజర్' షూటింగ్ లో పాల్గొనలేడు. అప్పుడు 'గేమ్ ఛేంజర్' మరింత ఆలస్యమై సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే అవకాశముంది.
ఇటు ఆగి ఆగి షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ కోసం వెయిట్ చేయలేక, అటు బుచ్చిబాబు ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెట్టలేక చరణ్ సతమతమవుతున్నాడట. ఈ రెండు సినిమాల షూటింగ్ విషయంలో సందిగ్ధం నెలకొనడంతో ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అవుతున్నారు. దానికి తోడు 'గేమ్ ఛేంజర్' నుంచి కనీస అప్డేట్స్ కూడా ఉండటం లేదు. ఇటీవల సాంగ్ రిలీజ్ అని ఆశ పెట్టిన మేకర్స్, చివరికి వాయిదా వేశారు. మరి చరణ్ ఇప్పటికైనా ఈ సినిమాల విషయంలో సరైన నిర్ణయం తీసుకొని, మునుపటి దూకుడు చూపిస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తాడేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
