ENGLISH | TELUGU  

‘రాక్షసుడు’ రివ్యూ

on May 29, 2015

 




హారర్‌, థ్రిల్ల‌ర్ జోన‌ర్ ఎంత‌గా ఊరిస్తోందంటే... బ‌డా హీరోలు కూడా వీటిపై దృష్టి పెడుతున్నారు. ఈ జోన‌ర్‌లో ఓ సినిమా చేసేస్తే పోలా..?  అనేసుకొని రంగంలోకి దిగేస్తున్నారు. ముని, కాంచ‌న‌, గంగ లాంటి సినిమాలు విజ‌య‌వంతం అవ్వ‌డంతో.. ఈ ఫార్ములాతో క‌నెక్ట్ అయిపోయారంతా. ఇప్పుడు సూర్య కూడా హార‌ర్ క‌థ‌లపై దృష్టిపెట్టాడు. అయితే సూర్య సినిమా అంటేనే మాస్‌, స్టైలిష్ సినిమాలు. దానికి హార‌ర్ అనే ఎలిమెంట్ జోడించి తీసిన సినిమా `రాక్ష‌సుడు`.  మ‌రి సూర్య న‌మ్ముకొన్న ఫార్ములా కాసులు రాలుస్తుందా?  సూర్య‌కి విజ‌యాన్ని అందించిందా?  తెలుసుకొందాం రండి.


క‌థ‌లోకెళ్తే... మాస్ (సూర్య‌), జెట్ (ప్రేమ్‌జీ అమ‌ర‌న్‌) ఇద్దరూ మంచి స్నేహితులు. మోసాలు చేసుకొంటూ బ‌తికేస్తుంటారు. మాస్.. మాలిని (న‌య‌న‌తార‌) అనే ఓ న‌ర్సుని ప్రేమిస్తాడు. మాలినిని ఓ ఆపద నుంచి కాపాడ‌డానికి ఓ దొంగ‌త‌నం ప్లాన్ చేస్తాడు మాస్‌. ఆ స‌మ‌యంలో యాక్సిడెంట్‌కి గుర‌వుతారు మాస్‌, జెట్‌. యాక్సిడెంట్ త‌ర‌వాత మాస్‌కి చిత్ర‌విచిత్ర‌మైన అనుభ‌వాలు ఎదుర‌వుతుంటాయి. మాస్‌కి ఆత్మ‌లు క‌నిపిస్తుంటాయి. త‌మ చివ‌రి కోరిక తీర్చి... ఆత్మ‌కు శాంతి క‌లుగజేయ‌మంటారు. ఆత్మ‌ల కోరిక‌క‌లు తీరుస్తూ... వాళ్ల‌నీ క్యాష్ చేసుకోవ‌డం మొద‌లెడ‌తాడు మాస్‌. ఇదే స‌మయంలో అచ్చం త‌న‌లానే ఉన్న శివ‌కుమార్ (రెండో సూర్య‌) పాత్ర ఎంటర్ అవుతుంది. అక్క‌డి నుంచి మాస్ జీవిత‌మే మారిపోతుంది. లెక్క‌లేని స‌మ‌స్య‌లు వెంట‌ప‌డ‌తాయి. అస‌లు శివ‌కుమార్ ఎవ‌రు?  మాస్‌కీ అత‌నికీ ఉన్న లింకేంటి?  ఆ ఆత్మ‌లు సూర్య జీవితంల‌తో ఎలా ఆడుకొన్నాయి?  అనేదే ఈ చిత్ర క‌థ‌.



ద‌ర్శ‌కుడు ఎత్తుకొన్న పాయింట్ మంచిదే. క‌థానాయ‌కుడి ఆత్మ‌లు క‌నిపించ‌డం, ఆత్మ‌ల్ని కూడా క‌థానాయ‌కుడు క్యాష్ చేసుకోవ‌డం థ్రిల్లింగ్ పాయింట్‌. అయితే ఆ పాయింట్‌ని ప‌క్క‌న పెట్టి చూస్తే.. జ‌స్ట్ ఇదొక రివైంజ్ డ్రామా. ఓ దెయ్యం మ‌నిషి స‌హాయంతో త‌న ప్ర‌తికారం తీర్చుకోవ‌డం. దొంగ పోలీస్‌, నిన్న మొన్నొచ్చిన వార‌ధి లాంటి క‌థ‌లు దాదాపుగా ఇలాంటి కాన్సెప్ట్‌తో సాగేవే. అంతెందుకు కాంచ‌న‌, ముని, గంగ‌..ఈ థ్రిల్ల‌ర్ & హార‌ర్ సినిమాల బేసిక్ లైనే ఇది. అయితే వెంక‌ట్ ప్ర‌భు దానికి కొన్ని స్ర్కీన్ ప్లే ట్రిక్కులు జోడించాడు. ఫ‌స్టాప్ అంతా సాదాసీదాగా సాగిపోయినా.. శివ‌కుమార్ పాత్ర ద్వారా సెకండాఫ్‌పై ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి క‌లిగించాడు. సెకండాఫ్‌లో కొన్ని ముడులున్నాయి. దాంతో... థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. కాక‌పోతే.. శివ‌కుమార్ ఫ్లాష్ బ్యాక్‌... అతి సాధార‌ణ‌మైన రివైంజ్ డ్రామా. దాంతో... ద‌ర్శ‌కుడు ఎత్తుకొన్న కొత్త పాయింట్, వేసుకొన్న ట్విస్టులు ఇవ‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీరైపోయాయి. ఇంత క‌థా న‌డిపింది ఈ మాత్రం ఓల్డ్ ఫార్ములా క‌థ కోస‌మా అనిపిస్తుంది. వెంక‌ట్ ప్ర‌భుపై ప్రేక్ష‌కుల‌కు ఓ స్థాయి అంచ‌నాలుంటాయి. ఎందుకంటే.. త‌న స్ర్కీన్ ప్లే కొత్త‌గా ఉంటుంది. పైగా ఇది సూర్య సినిమా. తాను ఎంచుకొన్న క‌థ‌ల్లో వైవిధ్యం ఉంటుంది. వీరిద్ద‌రూ క‌లిస్తే బంప‌ర్ బొనాంజానే అనుకొనే ప్రేక్ష‌కుల‌కు మాత్రం రాక్ష‌సుడు నిరుత్సాహ‌ప‌రుస్తుంది. సెకండాఫ్లో రెండు మూడు ఎపిసోడ్లు వారెవా అనిపించేలా ఉన్నాయి. కానీ సినిమా మొత్తాన్ని అలాంటి ఎపిసోడ్లు మాత్ర‌మే న‌డిపించ‌లేవు. వినోదం లేక‌పోవ‌డం ఈసినిమాకి అతి పెద్ద మైన‌స్‌. థ్రిల్ల‌ర్ సినిమాల్లో కామెడీని మిక్స్ చేయ‌డం నేరం అని ద‌ర్శ‌కుడు గ‌ట్టిగా అనుకొని ఉంటాడు. దాంతో రిలీఫ్ నిచ్చే విష‌యాలే లేక‌పోయాయి.



ద‌ర్శ‌కుడిపై హాలీవుడ్ సినిమాల ప్ర‌భావం చాలాఉంది. ఆ సంగ‌తి అత‌ని టేకింగ్ చూస్తే అర్థ‌మైపోతోంది. క‌థ‌ని గ్రిప్పింగ్‌గా న‌డిపించ‌గ‌లిగిన వెంక‌ట్ ప్ర‌భు... మ‌న జ‌నానికి కావ‌ల్సిందేమిటో ప‌ట్టుకోలేక‌పోయాడు. వెంకట్ ప్ర‌భు స్ర్కీన్ ప్లేలో దిట్ట‌. అయితే ఈసినిమాలో సాదా సీదా స్ర్కీన్‌ప్లే.. శాపంగా మారింది. ఉత్కంఠ‌త క‌లిగిస్తూ, భ‌య‌పెడుతూ, అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తే.. ఈసినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర గ‌ట్టెక్కేద్దును. అలా కాకుండా కేవ‌లం ట్విస్టుల‌నే న‌మ్ముకొని గ‌ట్టెక్కించేద్దామ‌నుకొన్నాడు.



న‌టీన‌టులు విష‌యానికొస్తే.. ఖ‌చ్చితంగా సూర్య‌ది ఇది వ‌న్ మాన్ షో. ఓ మాస్ ఇమేజ్ ఉన్న న‌టుడు ఇలాంటి క‌థ‌ని ఎంచుకోవ‌డం పెద్ద రిస్క్‌. కానీ.. సూర్య అది చేయ‌గ‌లిగాడు. అత‌ని వ‌ర‌కూ ఇది డిఫ‌రెంట్ ఎటెమ్ట్‌. రెండు పాత్ర‌ల్లోనూ వైవిధ్యం చ‌క్క‌గా చూపించాడు. సూర్య కెరీర్‌లో ది బెస్ట్ అని చెప్ప‌లేం గానీ... త‌న అభిమానుల ప‌రంగా సూర్య ఏమాత్రం నిరుత్సాహ‌ప‌ర‌చ‌డు. క‌థాయిక‌ల‌కు ఏమంత  స్కోప్ లేని పాత్ర‌. న‌య‌న ఫ‌ర్వాలేదు గానీ.. ప్ర‌ణీత‌ది చాలా చిన్న పాత్ర‌. న‌య‌న ఉన్నంత‌ల‌తో హుందాగా క‌నిపించింది. ఈ సినిమాతో ఆమెకు ప్ల‌స్య‌య్యేది లేదు. పోయేదీ ఏమీ లేదు. ప్రేమ్‌జీ అన‌గానే క‌మెడియ‌న్ గానే గుర్తిస్తాం. అయితే ఇందులో ఎమోష‌న్స్ పండించే ఛాన్స్ ద‌క్కింది. పార్తీబ‌న్ సీరియ‌స్‌గా క‌నిపించినా మ‌న‌కు కామెడీగా ఉంటుంది. తెలుగు ప్రేక్ష‌కుల కోసం బ్ర‌హ్మానందంపై రెండు మూడు సీన్లు యాడ్ చేశారు. బ్ర‌హ్మీ ప్ర‌భావం ఈ సినిమాపై అంత‌గా ఉండ‌దు. స‌ముద్ర ఖ‌ని న‌ట‌న ఆక‌ట్టుకొంటుంది.



యువ‌న్ ట్యూన్ల ప‌రంగా చేసిందేం లేదు. అయితే ఆర్‌.ఆర్ మాత్రం ఆక‌ట్టుకొంటుంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ లో యువ‌న్ ఇచ్చిన ఆర్‌.ఆర్ ఆ సీన్‌నిఅమాంతం లేపేస్తుంది. సినిమాలో క్వాలిటీ విష‌యంలో పేరు పెట్ట‌డానికి ఏంలేదు. కెమెరా వర్క్ నీట్‌గా ఉంది.  ఓ కొత్త పాయింట్‌ని ఎత్తుకొన్న ద‌ర్శ‌కుడు తొలి 30 నిమిషాలూ, ఇంట్రవెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్‌పైనే దృష్టి పెట్టి... మిగిలిన పార్ట్ సోసో గా న‌డిపేశాడు. తొలి 30 నిమిషాల్లో ఉన్న‌బిగి చివ‌రి కంటూ కొన‌సాగిస్తే.. ఈ సినిమా సూర్య కెరీర్‌లో ఓ సూప‌ర్ హిట్ చిత్రంగా మిగిలిపోయేది. నిడివి కూడా అతిపెద్ద స‌మ‌స్య‌. దాదాపు మూడుగంట‌ల సినిమా ఇది. అర్జెంటుగా కోత పెట్ట‌క‌పోతే.. ఆ ప్ర‌భావం వ‌సూళ్ల‌పై ప‌డే అవ‌కాశం ఉంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.