ENGLISH | TELUGU  

'రాజుగారి కోడిపులావ్' మూవీ రివ్యూ

on Aug 3, 2023

సినిమా పేరు: రాజుగారి కోడిపులావ్
తారాగణం: శివ కోన, అభిలాష్ బండారి, కునాల్ కౌశల్, రమ్య దినేష్, నేహా దేశ్ పాండే, ప్రాచీ కెథర్, ప్రభాకర్ తదితరులు
సంగీతం: ప్రవీణ్ మణి
సినిమాటోగ్రాఫర్: పవన్ గుంటుకు
ఎడిటర్: బసవా
రచన, దర్శకత్వం: శివ కోన
నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన
బ్యానర్స్: ఏఎమ్ఎఫ్, కోన సినిమా
విడుదల తేదీ: ఆగస్టు 4, 2023 

పలు చిన్న చిత్రాలు విభిన్న కథలతో రూపొంది ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల టైటిల్, ప్రచార చిత్రాలతో అంతోఇంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'రాజుగారి కోడిపులావ్'. మరి ఈ సినిమా ఎలా ఉంది? టైటిల్ కి తగ్గట్లుగానే విభిన్నంగా, ఆకట్టుకునేలా ఉందా?..

కథ:
మూడు జంటలు అటవీ ప్రాంతానికి ట్రిప్ కి వెళ్తాయి. అందులో రెండు జంటలు పెళ్లయిన జంటలు కాగా, ఒక జంట మాత్రం త్వరలో పెళ్లి చేసుకోబోయే జంట. వీరిలో ఒక జంట మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకునే ఆలోచనలో ఉంటుంది. అయితే ట్రిప్ లో వారి ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉందని, వాళ్ళ పాపకు పదే పదే కల వస్తుంది. పాప వెళ్ళొద్దని చెబుతున్నా వినకుండా వాళ్ళు ట్రిప్ కి వెళ్తారు. ఆ అటవీ ప్రాంతంలో కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. కొంతదూరం వరకు ఆ మూడు జంటల ప్రయాణం సాఫీగానే సాగుతుంది. ఆ తర్వాత కొన్ని ఊహించని ఘటనలు జరుగుతాయి. ఆ ఆరుగురిలో ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. ఆరుగురు ఐదుగురు అవుతారు. ఐదుగురు నలుగురు అవుతారు. గంటలు, రోజులు గడిచేకొద్దీ మిగతా వారిలో ప్రాణభయం పెరుగుతుంటుంది. అసలు ఆ అడవిలో ఏముంది? అక్కడికి వెళ్ళినవారు ప్రాణాలు కోల్పోవడానికి కారణమేంటి? అసలు ఈ కథకి, రాజుగారి కోడిపులావ్ కి సంబంధం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
దర్శకుడిగా, నటుడిగా రెండు పాత్రలు పోషించడం అంత తేలికైన విషయం కాదు. తనలోని దర్శకుడిని తృప్తి పరిచేలా కథకి తగ్గట్లుగా సినిమాని నడిపించాలా? లేక తనలోని నటుడిని తృప్తి పరిచేలా సన్నివేశాలు రాసుకోవాలా? అనే సందిగ్థత ఉంటుంది. అయితే కథకి తగ్గట్లుగా నటుడి పాత్రని మలిస్తే పెద్దగా సమస్య ఉండదు. అలా కాకుండా తనలోని నటుడిని తృప్తి పరచాలని దర్శకుడు అనుకుంటేనే అసలు సమస్య వస్తుంది.. సినిమా గాడి తప్పుతుంది. 'రాజుగారి కోడిపులావ్' సినిమా విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. శివ కోన ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు, సినిమాలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఆయన ఈ చిత్ర నిర్మాతల్లో కూడా ఒకరు. ఈ సినిమా చూశాక.. శివ కోన దర్శకుడిగా, నిర్మాతగా సినిమాని గొప్పగా మలచడం కంటే కూడా.. తనలో గొప్ప నటుడు ఉన్నాడని చూపించడం పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు అనిపించింది.

కోడిపులావ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజుగారి పాత్ర పరిచయంతో సినిమాని ప్రారంభించిన దర్శకుడు.. కాసేపటికే ఫారెస్ట్ ట్రిప్ అంటూ కొత్త కథలోకి తీసుకెళ్ళాడు. మూడు జంటల పరిచయ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు. వారు అడవిలోకి వెళ్ళిన తర్వాత.. అక్కడ ఏదో జరుగుతుందన్న ఉత్కంఠ అయితే కలుగుతుంది కానీ అందుకు తగ్గ బలమైన సన్నివేశాలు పడలేదు. ఇంటర్వెల్ బ్లాక్ పరవాలేదు. పెద్దగా మెరుపులు లేకపోయినా ప్రథమార్థం ఓ మాదిరిగా నడిచింది. ద్వితియార్థంలోనే అసలు ఈ రాజుగారి కోడిపులావ్ కథ ఏంటి? హత్యల వెనక ఉన్నది ఎవరు అనేది రివీల్ అవుతుంది. ఈ క్రమంలో దర్శకుడు తనలోని నటుడిని తృప్తి పరచడం కోసం.. తాను పోషించిన డ్యాని అనే పాత్ర ట్రాక్ పై కావాల్సిన దానికంటే ఎక్కువ దృష్టి పెట్టారు. దాంతో మెయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కంటే ఆ సైడ్ ట్రాక్ ఎపిసోడ్ నిడివే ఎక్కువుంది. అది కథని ముందుకి నడిపించకపోగా, సెకండాఫ్ లో బోర్ కొట్టడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది.

దర్శకుడు ఈ సినిమా ద్వారా 'అక్రమ సంబంధాలు ఆరోగ్యానికి హానికరం' అనే విషయాన్ని చెప్పాలనుకున్నారు. ఇందులో 2020లో వచ్చిన 'నిశ్శబ్దం' సినిమా ఛాయలు కనిపిస్తాయి. కథ కథనాలు గొప్పగా లేనప్పటికీ పరవాలేదు అనుకునేలా ఉన్నాయి. అయితే బలమైన సన్నివేశాలు తోడై, సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లయితే.. అవుట్ పుట్ ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా వచ్చి ఉండేది. అలాగే కుటుంబ ప్రేక్షకులు ఇబ్బందిపడేలా కొన్ని బోల్డ్ సన్నివేశాలు, ద్వంద్వార్థ సంభాషణలు, బూతులు ఉన్నాయి. ముఖ్యంగా మగ గైనకాలజిస్ట్ ని ఉద్దేశించి రాసిన ద్వంద్వార్థ సంభాషణలు ఎబ్బెట్టుగా ఉన్నాయి.

ప్రవీణ్ మణి నేపథ్య సంగీతం అక్కడక్కడా తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పవన్ గుంటుకు కెమెరా పనితనం బాగుంది. ఎడిటర్ బసవ సెకండాఫ్ లో చేతులెత్తేశారు. ఎవరో తన చేతికి సంకెళ్ళు వేసినట్టుగా, సెకండాఫ్ లో పలు సన్నివేశాలలో తన కత్తెరకు పని చెప్పాల్సి ఉన్నా, ఆ పని చేయలేదు. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
పేరుకి రాజుగారు టైటిల్ పాత్ర ప్రభాకర్ పోషించారు కానీ ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. కొన్ని సన్నివేశాలకు, పోస్టర్స్ లో ప్రమోషన్స్ కి పరిమితమయ్యారు. అయితే పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. ఇక దర్శకుడు శివ కోన.. డ్యాని అనే ముఖ్య పాత్ర పోషించారు. నటుడిగా ఆయన మంచి మార్కులే కొట్టేశారు. విభిన్న పాత్రలకు మేకర్స్ ఆయన పేరు పరిశీలించవచ్చు. అభిలాష్ బండారి, కునాల్ కౌశల్, రమ్య దినేష్, నేహా దేశ్ పాండే, ప్రాచీ కెథర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. అయితే పలు సన్నివేశాల్లో కొన్ని పాత్రల డబ్బింగ్ కృత్రిమంగా అనిపించింది. ఆ విషయం మీద శ్రద్ధ పెట్టాల్సింది.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమా ద్వారా 'అక్రమ సంబంధాలు ఆరోగ్యానికి హానికరం' అనే విషయాన్ని చెప్పాలనుకున్నారు. అయితే దర్శకుడు తనలోని నటుడిని తృప్తి పరచడం కోసం అన్నట్లుగా.. సెకండాఫ్ లో కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడం దానికంటే తన నటనా ప్రతిభను చూపించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపించింది. ఈ చిత్ర కథ కథనాలు గొప్పగా లేనప్పటికీ పరవాలేదు అనుకునేలా ఉన్నాయి. అయితే బలమైన సన్నివేశాలు తోడై, సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లయితే సినిమా కాస్త మెరుగ్గా ఉండేది. అలాగే ఈ సినిమాలోని పలు సన్నివేశాలు, సంభాషణలు కుటుంబ ప్రేక్షకులు ఇబ్బందిపడేలా ఉన్నాయి.

రేటింగ్: 2.25/5

-గంగసాని

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.