
రజినీకాంత్ సినిమాలు చూస్తే చాలు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్లు.. లోక తీరు ఎలా ఉంటుంది, ఎలాంటి డైలాగులు మన జీవితాన్ని మారుస్తాయి. ఒక్కోసారి మన కంటితో చూసినవి, చెవితో విన్నవి నిజాలు ఉండవు, వాస్తవంతో కూడిన సత్యం వేరే ఉంటుందనే విషయాలు తెలుస్తాయి. ఈ విషయం అభిమానులు, సినీ ప్రేమికులకి బాగా తెలుసు.
అందుకే ఇప్పుడు రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కనుంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే నభూతో నభవిష్యత్ అనే స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, చెరగని ముద్రను వేసుకున్న సజీవ దృశ్యకావ్యం మన ఇండియన్ ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ రజనీకాంత్. బెంగళూరు మహానగరంలో ఒక సాధారణ బస్సు కండక్టర్‌గా శివాజీరావు గైక్వాడ్ అనే పేరుతో జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి, నటుడిగా మారాలనే బలమైన ఆకాంక్షతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, కష్టనష్టాలను అధిగమించి కోలీవుడ్ సినీ సామ్రాజ్యానికి మహారాజుగా ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ అత్యంత స్ఫూర్తిదాయకం. దాదాపు 50 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వందలాది చిరస్మరణీయమైన చిత్రాలను అందించి, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ మరియు అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలను అందుకని కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని రజనీ మార్క్ వేసేశారు. ప్రస్తుతం ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న మలుపులు, అనుభవాలను క్రోడీకరిస్తూ స్వయంగా ఒక అద్భుతమైన ఆత్మకథను రాస్తున్న సంగతి సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇది కూడా చదవండి: ఇంద్రజని చూసి ఏడ్చేసిన ప్రముఖ నిర్మాత

ఈ క్రమంలోనే ఇండియన్ సినిమా ఐకాన్ రజనీకాంత్ జీవిత ఆధారంగా తెరకెక్కే ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రాజెక్ట్‌పై ఆయన కుమార్తె, ప్రముఖ దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ చేసిన తాజా సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తన తండ్రి బయోపిక్ నిర్మాణానికి సంబంధించిన అప్‌డేట్‌పై మాట్లాడుతూ, "నాన్న బయోపిక్ చాలా సూపర్ గా రూపుదిద్దుకుంటోందని, ఇది కేవలం ఒక సినీ నటుడి కథ మాత్రమే కాదని, ఒక భగవద్గీత లేదా మహాభారతం తరహాలో ప్రతి ఒక్కరికీ జీవిత సత్యాలను బోధించే మార్గదర్శిలా ఉంటుందని" ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. తండ్రి ఆత్మకథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మహా ప్రయాణాన్ని ముందుగా ఒక విశిష్టమైన పుస్తకంగా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించి, ఆ తర్వాత దానిని అత్యంత భారీ స్థాయిలో డిజిటల్ వెబ్ సిరీస్‌గా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఐశ్వర్య స్పష్టం చేశారు.
అంతేకాకుండా, మరొక కుమార్తె సౌందర్య రజనీకాంత్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఈ అపూర్వ కథను ఒక పూర్తి స్థాయి విజువల్ వండర్ వెండితెర సినిమాగా కూడా మలిచే ఆలోచన ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దర్శకుడు కే. బాలచందర్ చేతిలో పడి 'అపూర్వ రాగంగళ్' చిత్రంతో ప్రతినాయకుడిగా ప్రయాణం ప్రారంభించి, 'భైరవి'తో కథానాయకుడిగా మారి, నేడు గ్లోబల్ బ్రాండ్‌గా రూపాంతరం చెందిన రజనీకాంత్ అసమాన జీవన పోరాటం ఖచ్చితంగా వెండితెరపై మరియు ఓటీటీ డిజిటల్ మాధ్యమంలో సరికొత్త రికార్డులను తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదు దశాబ్దాల సినీ సామ్రాజ్య వైభవాన్ని, ఆయన పడిన తపనను కళ్లకట్టినట్లు చూపే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
[Rajinikanth Biopic Like BhagavadGita Aishwarya Reacts, Rajinikanth Biopic, Aishwarya Rajinikanth, Rajinikanth Autobiography, Soundarya Rajinikanth, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]






