Home

»

Latest News

Peddi: రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు!

Apr 01, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'పెద్ది'(Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి గ్లింప్స్ వరకు ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా రీసెంట్‌గా విడుదలైన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె(Raghu Kunche) తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, ఏఆర్ రెహమాన్ సంగీతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి.

90s నాటి రెహమాన్‌ కనిపిస్తున్నారు..
పెద్ది నుంచి విడుదలైన చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం గురించి రఘు కుంచె మాట్లాడుతూ.. "ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట 'చికిరి చికిరి'. ప్రతి రోజూ వింటున్నాను. చాలా కాలం తర్వాత రెహమాన్ గారు మళ్ళీ తన వింటేజ్ స్టైల్‌ను చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆయన సాంగ్స్ చాలా సింపుల్ గా, మెలోడియస్ గా ఉండేవి. ఆ తర్వాత ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వెళ్ళాక కొంచెం కాంప్లికేటెడ్ మ్యూజిక్ వైపు వెళ్లారు. కానీ 'పెద్ది' చిత్రంతో మళ్ళీ తన మార్కు 90ల నాటి వింటేజ్ రెహమాన్‌ను గుర్తుచేస్తున్నారు. ఆ పాటల్లోని ఫ్లేవర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు సానా రెహమాన్ నుంచి తనకు కావాల్సిన అవుట్‌పుట్‌ను అద్భుతంగా రాబట్టుకున్నారు" అని ప్రశంసించారు.

మట్టి వాసన ఉన్న కథలు ఎప్పుడూ స్పెషలే..
ప్రస్తుతం ప్రేక్షకులు రూటెడ్ కథలకు, అంటే మట్టి వాసన ఉన్న విలేజ్ సబ్జెక్టులకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని రఘు కుంచె అభిప్రాయపడ్డారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే కథలు కేవలం పాత జ్ఞాపకాలనే కాకుండా, కొత్త తరానికి ఒక విభిన్నమైన ప్రపంచాన్ని చూపిస్తాయని ఆయన పేర్కొన్నారు. తమిళంలో మారి సెల్వరాజ్, వెట్రిమారన్ వంటి దర్శకులు ఇలాంటి కథలతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇప్పుడు మన తెలుగులో కూడా అలాంటి ప్రయత్నాలు జరగడం శుభపరిణామమని అన్నారు. 'పెద్ది' కూడా అలాంటి ఒక పవర్‌ఫుల్ రూటెడ్ సబ్జెక్ట్ అని ఆయన పేర్కొన్నారు.

పహిల్వాన్ లుక్ అదిరిపోయింది.. 
రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో చరణ్ ధరించిన గోచి కట్టు, ఆయన మాసివ్ బాడీ లాంగ్వేజ్‌ను చూసి అంతా షాక్ అవుతున్నారు. దీనిపై రఘు కుంచె స్పందిస్తూ.. "అది నిజమైన పహిల్వాన్ లుక్. చరణ్ పడ్డ కష్టం ఆ స్క్రీన్‌పై కనిపిస్తోంది. నిజానికి ఆ కుస్తీ ఫైట్లు చేస్తున్నప్పుడు ఆయనకు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయని విన్నాను. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా అంత రిస్క్ తీసుకుని రియలిస్టిక్‌గా చేయడం గొప్ప విషయం." అని చరణ్ డెడికేషన్‌ను కొనియాడారు.

నటనలో కష్టం.. సౌకర్యాల మధ్యే అసలైన సవాల్..
పూర్వం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో ఆర్క్ లైట్ల కింద నటించడం ఎంతో కష్టంగా ఉండేదని, ఇప్పటి హీరోలకు క్యారవాన్లు వంటి సౌకర్యాలు ఉన్నా.. క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేయడంలో అదే కష్టం ఉంటుందని రఘు కుంచె వివరించారు. రామ్ చరణ్ తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక పల్లెటూరి మల్లయోధుడిగా మారడం చిన్న విషయం కాదని ఆయన అన్నారు.

మొత్తానికి 'పెద్ది' చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, బుచ్చిబాబు సానా మేకింగ్ మరియు రెహమాన్ సంగీతం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని రఘు కుంచె నమ్మకం వ్యక్తం చేశారు. మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

రఘు కుంచె ఫుల్ ఇంటర్వ్యూ & మరిన్ని ఆసక్తికర సినీ విశేషాల కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com