టాప్ స్టోరీ: 'రాధేశ్యామ్' ఫస్ట్ లుక్.. ప్రభాస్, పూజా పెయిర్ కిరాక్!
on Jul 10, 2020
ఎప్పుడెప్పుడా అని అశేష అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోన్న నేటి తరం రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ వచ్చేసింది. కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నట్లే సినిమాకు 'రాధే శ్యామ్' అనే టైటిల్ ఖరారు చేశారు. జూలై 10 ప్రభాస్ కెరీర్ దిశను మార్చేసిన 'బాహుబలి: ద బిగినింగ్' ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోజు. అందుకే అతని కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎనౌన్స్మెంట్కు అది బెస్ట్ డే అని భావించిన నిర్మాతలు 'రాధే శ్యామ్' టైటిల్‌ను ఎనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఇదే టైటిల్‌ను ఖాయం చేశారు. దీంతో పాటు ప్రభాస్, పూజా హెగ్డే రొమాంటిక్ స్టిల్‌ను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకొని కళ్లు మూసుకొని, తన్మయత్వాన్ని అనుభవిస్తున్నట్లు ఉన్న ఈ ఇద్దరూ బెస్ట్ పెయిర్‌గా కనిపిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తోన్న ఈ మూవీలో రాధ, శ్యామ్ అనే ప్రేమికులుగా పూజ, ప్రభాస్ నటిస్తున్నారని అర్థమవుతోంది. అందుకే ఆ ఇద్దరి పేర్లూ కలిసివచ్చేలా 'రాధే శ్యామ్' అనే టైటిల్ నిర్ణయించినట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ టైటిల్‌ను ఫ్యాన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
2021 సమ్మర్ గిఫ్ట్‌గా 'రాధే శ్యామ్' ఆడియెన్స్ ముందుకు వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 'బాహుబలి' మూవీతో ప్రభాస్ మార్కెట్ వాల్యూని దేశవ్యాప్తంగా పెంచేశాడు రాజమౌళి. 'సాహో' సినిమా విషయంలో అది నిరూపితమైంది. ఏ సౌతిండియన్ స్టార్‌కు లేని విధంగా నార్త్ ఇండియాలో ఆ మూవీని భారీ రేట్లకు బయ్యర్లు కొనగా, కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వచ్చి, తెలుగునాట కంటే అక్కడే హిట్టయ్యింది. అలా ఏకైక పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు ప్రభాస్. అయితే తెలుగునాట 'బాహుబలి 2' రికార్డులను 'సాహో' అధిగమించలేకపోయింది. అయితే 'రాధేశ్యామ్' మూవీ పరిస్థితి అలా ఉండదనీ, 'బాహుబలి 2' రికార్డులను అది బద్దలుకొడుతుందనీ ప్రభాస్ ఫ్యాన్స్ గట్టి నమ్మకాన్ని కనపరుస్తున్నారు.
'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ అల్ట్రా మోడరన్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. సిల్వర్ కలర్ సూట్లో ఉన్న అతను రెడ్ కలర్ గౌన్ ధరించిన పూజా హెగ్డేను పొదివి పట్టుకున్న తీరు ఒక గొప్ప లవ్ స్టోరీతో ప్రభాస్ మన ముందుకు రానున్నాడనే సంకేతాలు ఇస్తున్నాయి. తెలుగునాట 'సాహో' ఫలితం నిరాశపరచడంతో రాధే శ్యామ్ సినిమా కోసం అతను మరింతగా శ్రమిస్తున్నాడు. మరోవైపు టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ హోదాను ఎంజాయ్ చేస్తోన్న పూజా లుక్ సైతం అదరగొడుతోంది. 'అల.. వైకుంఠపురములో' మూవీలో తన రూపంతో, తన చూపులతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసిన ఆమె, ప్రభాస్‌కు పర్ఫెక్ట్ జోడీగా కనిపిస్తూ మరోసారి అలాంటి అనుభవాన్నే రాధ పాత్రతో ఇస్తాననే నమ్మకాన్ని కలిగిస్తోంది.
ఈ మూవీలో ప్రభాస్ తల్లిగా ఒకప్పటి సంచలన బాలీవుడ్ తార భాగ్యశ్రీ నటిస్తుండటం విశేషం. 'మైనే ప్యార్ కియా' అనే బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ మూవీతో సెన్సేషనల్ స్టార్‌గా రాత్రికి రాత్రే అవతరించిన ఆమె, అదే సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'ప్రేమ పావురాలు'తో మన ప్రేక్షకులనూ సమ్మోహితులను చేసిన రోజులు ఇంకా మన జ్ఞాపకాల్లో పదిలంగానే ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఆమె ఈ సినిమాతో మన ముందుకు వస్తుండటం ఆనందాన్ని కలిగించే విషయం. అలాగే బిల్లా, రెబల్ సినిమాల్లో ప్రభాస్‌తో నటించిన అతని పెదనాన్న సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. అయితే తనది ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్ కాదని ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాని ఆయన ప్రెజెంట్ చేస్తుండటం గమనార్హం.
'సాహో' తరహాలోనే భారీ బడ్జెట్ అంచనాతో ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పటికీ, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఏర్పడ్డ ప్రతికూల వాతావరణంలో బడ్జెట్‌ను కుదించుకోక తప్పని స్థితి. టి సిరీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో సచిన్ ఖడేకర్, మురళీశర్మ, ప్రియదర్శి, సాషా చెత్రి, కునాల్‌రాయ్ కపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. తమిళ కమెడియన్ సత్యన్ ఈ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు.
ఎన్నో విశేషాలతో తయారవుతున్న 'రాధే శ్యామ్' ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సిందే.
Also Read