'రాధే శ్యామ్' దర్శకుడికి యూవీ మరో ఛాన్స్.. హీరో ఎవరో తెలుసా?
on Jun 6, 2023
ఘోర పరాజయం తర్వాత యువ దర్శకులకు మరో అవకాశం రావడం అంత తేలిక కాదు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పరిస్థితి అలాంటిదే. రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన 'రాధే శ్యామ్' విడుదలై ఏడాది దాటిపోయినా ఇంతవరకు ఆయన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఓ కోలీవుడ్ హీరో ఆయనతో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
గోపీచంద్ హీరోగా నటించిన 'జిల్' సినిమాతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా విజయం సాధించినప్పటికీ.. తన స్టైలిష్ మేకింగ్ తో రాధాకృష్ణ ఆకట్టుకున్నాడు. దీంతో 'జిల్' చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ ఆయనకు ఏకంగా ప్రభాస్ తో 'రాధే శ్యామ్' చేసే అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఆ అవకాశాన్ని రాధాకృష్ణ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందిన 'రాధే శ్యామ్' ఘోర పరాజయం పాలైంది. దీంతో దర్శకుడిగా మూడో సినిమా అవకాశం కోసం రాధాకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మధ్య గోపీచంద్ తో మరో సినిమా చేయనున్నాడని న్యూస్ వినిపించింది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ పేరు కూడా వినిపించింది. ఇక ఇప్పుడు మరో కోలీవుడ్ హీరో విశాల్ పేరు తెరపైకి వచ్చింది.
విశాల్ కి తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే విశాల్ తో రాధాకృష్ణ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే రాధాకృష్ణ ఒక కథ వినిపించడం, అది విశాల్ కి నచ్చడం కూడా జరిగిపోయాయట. అంతేకాదు ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని సమాచారం. 'జిల్' హిట్ కాకపోయినా, 'రాధే శ్యామ్' డిజాస్టర్ గా నిలిచినా.. దర్శకుడిగా రాధాకృష్ణకు వరుసగా మూడో అవకాశం ఇవ్వడానికి యూవీ సిద్ధపడటం ఆసక్తికరంగా మారింది. మరి మూడో సినిమాతో అయినా రాధాకృష్ణ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
