Home

»

Latest News

టైమ్ ట్రావెల్‌తో వచ్చిన 'పుష్పక విమానం'.. నాలుగు ఎపిసోడ్స్‌లో అసలు కథ మొదలైందా?

Nov 12, 2026 5:58PM

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే రూపొందిన 'పుష్పక విమానం' సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి రోనక్ ప్రధాన పాత్రలో నటించగా, భరణి శంకర్ కీలక పాత్ర పోషించారు. సతీశ్ మల్లిడి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నవంబర్ 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తొలి నాలుగు ఎపిసోడ్స్‌ను విడుదల చేశారు. ఇకపై ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ అందుబాటులోకి రానున్నాయి.

'పుష్పక్' (సాయి రోనక్) ఒక మధ్యతరగతి యువకుడు. చదువులో అంతగా రాణించకపోయినా ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. మాటకారితనంతో పాలసీలు చేయించడంలో ముందుంటాడు. అయితే ఉద్యోగం తర్వాత అతని ఆలోచనలన్నీ సావిత్రి (మధు దామరాజు) చుట్టూనే తిరుగుతుంటాయి. ఆమె పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటుంది. ఎనిమిదేళ్లుగా పుష్పక్ తన ప్రేమను వ్యక్తం చేస్తున్నా సావిత్రి మాత్రం అతనిపై కోపంగానే ఉంటుంది. మరోవైపు పుష్పక్ తమ్ముడు సంకేత్, ధనిక కుటుంబానికి చెందిన సారాను ప్రేమిస్తుంటాడు. ఆమె తండ్రి దగ్గర అవమానం ఎదురవడంతో బాగా డబ్బు సంపాదించి తిరిగి వస్తానని సంకేత్ సవాల్ చేసి వెళ్తాడు.

ఇదిలా ఉంటే పుష్పక్ నివసించే డార్విన్ కాలనీని ఖాళీ చేయించేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. వారికి పోలీస్ అధికారి ప్రభు సహకరిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అజ్ఞాత వ్యక్తి (భరణి శంకర్) పుష్పక్‌కు పరిచయమవుతాడు. కాలనీ చివరన ఉన్న ఓ పాడుబడిన భవనంలోని లిఫ్ట్ అతని జీవితాన్ని మార్చేస్తుందని చెబుతాడు. మొదట ఆ మాటలను పట్టించుకోని పుష్పక్, అనుకోకుండా ఓ రాత్రి ఆ భవనానికి వెళ్తాడు. చాలా కాలం క్రితం ఆ ప్రాంతాన్ని తాకిన ఉల్కా శకలాలకు, అక్కడి లిఫ్ట్‌కు సంబంధం ఉంటుంది. ఆ లిఫ్ట్‌లోకి అడుగుపెడితే గతంలోకి వెళ్లే అవకాశం ఉందని అతనికి తెలుస్తుంది. ఆ తర్వాత పుష్పక్ ఏం చేస్తాడన్నదే మిగతా కథ.

తన జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి గతంలోకి వెళ్లే అవకాశం వస్తే ఏం చేస్తాడు అనే ఆలోచనతో ఈ కథను రూపొందించారు. ప్రేమించిన అమ్మాయిని ఒప్పించడం, కుటుంబ పరిస్థితిని మార్చడం, తండ్రి గర్వపడేలా చేయడం, తమ్ముడి ప్రేమను గెలిపించడం, కాలనీని కాపాడుకోవడం.. ఇలా హీరో ముందు అనేక లక్ష్యాలను ఉంచారు. అయితే అసలు టైమ్ ట్రావెల్ అంశం నాలుగో ఎపిసోడ్ చివర్లోనే మొదలవుతుంది. అప్పటివరకు కథనం ఎక్కువగా హీరో ఉద్యోగం, ప్రేమ వ్యవహారం, ఇతర పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ ఎపిసోడ్స్‌లో పెద్దగా ఆసక్తికరమైన మలుపులు కనిపించవు.

సాయి రోనక్ తన పాత్రకు తగ్గట్టుగా చురుగ్గా నటించారు. మిగతా ప్రధాన పాత్రధారులు కూడా తమ పరిధిలో బాగానే చేశారు. అయితే కొన్ని ఉప పాత్రలు, వాటికి సంబంధించిన సన్నివేశాలు సహజంగా అనిపించవు. భరణి శంకర్ పాత్రను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా, ఆ దిశగా ప్రయత్నం పూర్తిస్థాయిలో కనిపించదు. సాయితేజ ఫొటోగ్రఫీ, ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ నేపథ్య సంగీతం, సాజత్ అలీ ఎడిటింగ్ ఓ మోస్తరుగా ఉన్నాయి.

మొత్తంగా తొలి నాలుగు ఎపిసోడ్స్‌ను చూస్తే టైమ్ ట్రావెల్ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, దాన్ని తెరపైకి తీసుకొచ్చే విషయంలో కథనం వేగం పుంజుకోలేదు. పాత్రలు, వాటి సమస్యల పరిచయానికే ఎక్కువ సమయం కేటాయించారు. నాలుగో ఎపిసోడ్ చివర్లో అసలు కథ మొదలవుతుందనే ఆసక్తి కలుగుతుంది. రాబోయే ఎపిసోడ్స్‌లో టైమ్ ట్రావెల్ అంశాన్ని ఎలా ఉపయోగించుకుంటారు? పుష్పక్ తన గతాన్ని మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? అనే విషయాలపై సిరీస్ ఆసక్తి పెంచాల్సి ఉంది. 

 

 

[PushpakaVimanam, SaiRonak, JioHotstar, TeluguWebSeries] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com