
గీతాంజలి... ఎలాంటి మలినం అంటుకొని, కల్మషం లేని ప్రేమ మా దగ్గర కూడా ఉంటుందని తెలుగు సినిమా ఎప్పుడు గర్వంతో చెప్పుకునేలా చేసిన మూవీ. సృష్టి, పునర్ సృష్టి, కంటే ఇద్దరు యువతి యువకుల మధ్య పుట్టే పవిత్రమైన ప్రేమ గొప్పదని కూడా చెప్పిన ఈ మూవీ రేపు వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ కాబోతుంది.
తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, తరతరాలకు గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అలాంటి అపురూప దృశ్యకావ్యాలలో 'గీతాంజలి' ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటుంది. 1989 మే 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ ప్రేమకథ, సరిగ్గా 37 ఏళ్ల తర్వాత మళ్ళీ వెండితెరపై మాయాజాలం చేయడానికి సిద్ధమైంది. దీంతో అక్కినేని నాగార్జున అభిమానులు, సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా తెరకెక్కించిన ఏకైక చిత్రం 'గీతాంజలి' కావడం దీనికున్న ప్రత్యేకత. 1988 అక్టోబర్ 12న మొదలైన ఈ చిత్ర షూటింగ్ కేవలం 60 రోజుల్లోనే పూర్తయినా, అది తెరపై సృష్టించిన ప్రభంజనం మాత్రం దశాబ్దాల పాటు చెక్కుచెదరలేదు.

చావుకు దగ్గరవుతున్న ఇద్దరు యువ ప్రేమికుల మధ్య చిగురించే స్వచ్ఛమైన ప్రేమని , జీవితం పట్ల వారికి ఉండే ఆశను మణిరత్నం ఒక కవిత్వంలా తెరపై ఆవిష్కరించారు. ఊటీలోని మంచు కొండల నడుమ ప్రకాష్(నాగార్జున) గీతాంజలిల అల్లరి, వారి మధ్య సాగే సున్నితమైన భావోద్వేగాలు నేటి తరం ప్రేక్షకులను సైతం కట్టిపడేస్తాయి.
ఇది కూడా చదవండి :రామాయణపై మహేష్ కొడుకు గౌతమ్ ఇచ్చిన రివ్యూ ఇదే!
ఈ సినిమా విజయంలో ఇళయరాజా అందించిన సంగీతం, వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం, పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం మూడు ప్రధాన స్తంభాలుగా నిలిచాయి. "ఆమనీ పాడవే", "ఓ ప్రియా ప్రియా", "ఓ పాపా లాలీ", "జగడ జగడ జగడం", ఒళ్ళంతా జల్లంత కావాలిలే ఇలా అన్ని సాంగ్స్ ఇప్పటికీ ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్‌లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ సినిమా 37వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డును గెలుచుకోవడమే కాకుండా, ఏకంగా 6 నంది పురస్కారాలను, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది.

ఇటీవల కాలంలో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న తరుణంలో, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ క్లాసిక్ చిత్రాన్ని 4K హంగులతో మళ్ళీ థియేటర్లలోకి తీసుకురావడం విశేషం. నాలుగు రోజుల క్రితం విడుదలైన రీ-రిలీజ్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 4 లక్షల 34 వేలకు పైగా వ్యూస్ రావడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. నాగార్జున కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడటం పాత తరానికి ఒక నోస్టాల్జియా అయితే, యువతరానికి ఒక అద్భుతమైన సినీ అనుభూతి. నిజంగా తెలుగు సినిమా ఉన్నంతవరకు 'గీతాంజలి' అనే ఈ అపురూప ప్రేమ దృశ్యకావ్యం అభిమానులు, ప్రేమికులు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది.
పైగా నాగార్జున శివ లాంటి కల్ట్ మాస్ తర్వాత పూర్తి లవర్ బాయ్ గా, అరుదైన వ్యాధికి గురైన పేషేంట్ గా చేసి మెప్పించాడు. ఇది వరల్డ్ హిస్టరీలోనే ఏ హీరో చేయని సాహసం. అందుకే నాగ్ ని కింగ్ అంటారు.హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కర్నూల్ లో వంద రోజులు హౌస్ ఫుల్స్ తో ఆడింది.
మీకు నచ్చవచ్చు:అద్భుతమైన హిందీ సాంగ్స్ ఎందుకు వినిపించడం లేదు!
మీకు నచ్చవచ్చు: Goat మూవీ రివ్యూ
[Geethanjali, Nagarjuna, Girija, manirathnam, ilayaraja]





