Home

»

Latest News

పుష్పకి మాకు డబ్బులు రాలేదు.. ఆర్ఆర్ఆర్ తర్వాత 100 థియేటర్లు మూతపడ్డాయి!

May 13, 2026

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం థియేటర్ల మనుగడ, ఎగ్జిబిటర్ల సమస్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా థియేటర్ల అద్దెలు, పర్సెంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు కొన్నాళ్లుగా గళమెత్తుతున్నారు. తాజాగా తెలంగాణ ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత శిరీష్ (Shirish) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

సినిమా రంగం ఇప్పుడు కేవలం ప్రాంతీయ స్థాయికి పరిమితం కాలేదని, అన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయని శిరీష్ గుర్తు చేశారు. "హై బడ్జెట్ సినిమా అంటే అది తెలుగు సినిమా కాదు, పాన్ ఇండియా సినిమా. మరి అలాంటప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో పర్సెంటేజీ విధానం అమలవుతున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదు?" అని ఆయన ప్రశ్నించారు. మన హీరోలు, మన డైరెక్టర్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్నా, మన సొంత గడ్డపై థియేటర్ల వ్యవస్థ మాత్రం సంక్షోభంలో కూరుకుపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు బెంగళూరులో ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవని, ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయని శిరీష్ హెచ్చరించారు. హైదరాబాద్ పరిస్థితి కూడా అదే దిశగా వెళ్తోందని, 'ఆర్ఆర్ఆర్' విడుదలైన సమయం నుండి ఇప్పటివరకు సుమారు 100 థియేటర్లు మూతపడటం దారుణమని అన్నారు. పాలిచ్చే వాడే పాలేరు అయినట్టుగా.. అసలు రెవెన్యూ జనరేట్ చేసే థియేటర్లను చిన్నచూపు చూస్తూ, ఓటీటీలకు ప్రాధాన్యత ఇవ్వడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

పుష్ప వంటి పెద్ద సినిమాల వల్ల దేశవ్యాప్తంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారని, కానీ ఆ సినిమాల వల్ల ఇక్కడి థియేటర్ల యాజమాన్యాలకు ఆశించిన స్థాయిలో లాభాలు అందడం లేదని శిరీష్ పేర్కొన్నారు. రాబోయే 'పెద్ది' వంటి పెద్ద సినిమాల విషయంలో కూడా ఇదే పద్ధతి కొనసాగితే కష్టమని, పర్సెంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు అందరూ ఐక్యంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతలు కూడా సానుకూలంగా స్పందించి ఈ పర్సెంటేజీ సిస్టమ్‌కు మొగ్గు చూపితేనే ఇండస్ట్రీ భవిష్యత్తు బాగుంటుందని ఆయన సూచించారు.

మొత్తానికి, థియేటర్లలో సినిమా చూసే అనుభూతిని కాపాడుకోవాలంటే వ్యవస్థలో మార్పు రావాలని శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సమస్యపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com