ఐబొమ్మ రవి కంటే పెద్ద దొంగలు వాళ్లే.. సినిమా పైరసీకి బాధ్యులు వాళ్లే!
on Nov 19, 2025
గత కొన్నిరోజులుగా సినిమా పైరసీ గురించి, ఐబొమ్మ రవి అరెస్టు గురించి మీడియాలో, సోషల్ మీడియలో విపరీతమైన చర్చ జరుగుతోంది. సినిమా పైరసీకి ఎవరు కారణం అనే విషయంలో రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఫిలింఛాంబర్‌లోని ప్రముఖులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీస్ శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు పైరసీ అనే సమస్యను పలు కోణాల్లో వివరించే ప్రయత్నం చేశారు.
‘గత కొన్ని సంవత్సరాలుగా ఐబొమ్మ అనే వెబ్‌సైట్ ద్వారా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీకి గురవుతున్న విషయం తెలిసిందే. సినిమాలను స్క్రీనింగ్ చేసే క్యూబ్, యుఎఫ్‌ఓల ద్వారానే పైరసీ జరుగుతోంది. కొన్ని వేల సినిమాలు ఐబొమ్మలోకి వెళ్ళడానికి కారణం కూడా అదే. క్యూబ్, యుఎఫ్‌ఓ సంస్థలు పాతకాలం నాటి సర్వర్లు ఉపయోగించడం వల్ల పైరసీదారులకు అందులో నుంచి కంటెంట్‌ని రాబట్టుకోవడం ఈజీ అయిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ రవి గురించి మరో విషయం చెప్పాలి. పుష్ప2 తన దగ్గరకు వారం ముందే వచ్చినప్పటికీ వెంటనే దాన్ని అప్‌లోడ్ చెయ్యకుండా ఆగాడట. అతను ముందే రిలీజ్ చేసి ఉంటే ఫైనాన్సియర్లు, నిర్మాతలు, అడ్వాన్సులు ఇచ్చిన ఎగ్జిబిటర్లు అంతా ఏమైపోయేవారు. అందుకే అతన్ని మంచి దొంగ అంటాను.
పైరసీ విషయంలో అసలైన దొంగలు క్యూబ్, యుఎఫ్‌ఓ సంస్థలే. అంతేకాదు, అక్కడి నుంచే పైరసీ అవుతోందని తెలిసి కూడా మాట్లాడకుండా ఉన్న సినిమా ప్రముఖులు అందరి కంటే దొంగలు అని నా ఉద్దేశం. అసలు ప్రేక్షకులు ఐబొమ్మ వైపు వెళ్లడానికి, అక్రమంగా ఆ వెబ్‌సైట్ నుంచి సినిమాలు చూడడానికి ప్రధాన కారణం.. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న నిర్మాతలే. ఎందుకంటే వందల కోట్లు బడ్జెట్ పెట్టి అందులో 90 శాతం రెమ్యునరేషన్ల కింద కొందరికి ఇచ్చేస్తున్నారు. కేవలం 10 శాతం మాత్రమే ప్రొడక్షన్‌కి ఖర్చు చేస్తున్నారు.
సినిమా చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఎక్కువ బడ్జెట్‌తో చేసిన సినిమాలు కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసే ఉద్దేశంతో భారీ బడ్జెట్‌లతో సినిమాలు చేసి ఆ భారమంతా సామాన్య ప్రేక్షకులపై వేస్తున్నారు కొందరు నిర్మాతలు. అంతేకాదు, సాధారణంగా ఉన్న టికెట్ ధరలను అసాధారణ స్థాయికి తీసుకెళ్లిపోయి ప్రేక్షకులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. అందుకే ఫ్రీగా వస్తుంది కదా అని పైరసీలో సినిమాలు చూసేస్తున్నారు. ఈ విషయంలో ఇకనైనా నిర్మాతలు పునరాలోచన చేయాలి’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



