కేసీఆర్ దగ్గరకు బాలకృష్ణతో వెళితే పని జరగదా?
on May 29, 2020

తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేసీఆర్ సీయంగా ఉన్నారు. ఆయన దగ్గరకు బాలకృష్ణతో వెళితే పని జరగదా? చిరంజీవితో వెళితే పని జరుగుతుందా? చిరంజీవిని ఒక విధంగా, బాలకృష్ణను మరో విధంగా కేసీఆర్ ట్రీట్ చేస్తారా? నిర్మాత సి. కల్యాణ్ వెర్షన్ చూస్తుంటే అటువంటి అనుమానాలే కలుగుతాయి.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ‘జై సింహా’, ‘రూలర్’ సినిమాలను సి. కల్యాణ్ నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ చర్చలకు తనను పిలవలేదని బాలకృష్ణ కామెంట్స్ చేసిన తర్వాత సి. కల్యాణ్ సీన్‌లోకి వచ్చారు. బాలకృష్ణను ఎవరైనా అవమానిస్తే ముందు తాను ఊరుకోనని అన్నారు. ‘‘బాలకృష్ణగారు మా హీరో. మా మధ్య బేధాలు లేవు. మేం ఏ పార్టీకి సంబంధించిన వాళ్లం కాదు. తెలుగు సినిమా వాళ్లం. బాలకృష్ణగారు వస్తానంటే ఎవరైనా కాదంటారా?’’ అని సి. కల్యాణ్ అన్నారు. అక్కడ వరకూ ఎటవంటి అభ్యంతరాలు లేవు. అయితే, ‘‘ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘బాలకృష్ణగారూ... మీరు రండి. మీరు చెబితే వెంటనే పని అవుతుంది’ అని తీసుకువెళ్లాం. అంతే తప్పితే... డివైడింగ్ అసలు లేదు. ఎవరితో పని జరుగుతుందంటే వాళ్లను తీసుకువెళతాం’’ అని సి. కల్యాణ్ అనడం కొందరికి నచ్చలేదు.
సినిమా విషయాలు వచ్చేసరికి బాలకృష్ణ రాజకీయాలను పక్కన పెట్టిన సందర్భాలు కోకొల్లలు. చిరంజీవి సహా అందరితోనూ సఖ్యతగా ఉంటారు. అటువంటి వ్యక్తికి సినిమా చర్చలకు వచ్చేసరికి రాజకీయాలు ఆపాదించడం సరికాదని సి. కల్యాణ్ వ్యాఖ్యలపై అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



