ప్రియమణి ఖాతాలో మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్
on Jun 24, 2021

నటిగా ప్రియమణిది 18 ఏళ్ళ సినీ ప్రస్థానం. దక్షిణాది భాషలన్నింటిలోనూ నాయికగా తనదైన ముద్రవేసిన ప్రియమణి.. హిందీ చిత్ర పరిశ్రమలోనూ సందడి చేసింది. అడపాదడపా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లోనూ అలరించింది. `క్షేత్రం` (2011), `చారులత` (2012) `చండీ` (2013) వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో ప్రియమణి ఆకట్టుకుంది. కట్ చేస్తే.. భారీ విరామం అనంతరం మరో నాయికా ప్రాధాన్యమున్న సినిమాలో నటించబోతోంది ప్రియమణి.
ఆ వివరాల్లోకి వెళితే.. కన్నడనాట విమర్శకుల ప్రశంసలు అందుకున్న `యాక్ట్ 1978` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుని ఎండగట్టే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ప్రధానంగా ఓ గర్భిణి స్త్రీ చుట్టూ తిరుగుతుంది. కన్నడంలో ఈ పాత్రని `లక్ష్మీస్ ఎన్టీఆర్` ఫేమ్ యజ్ఞ శెట్టి పోషించింది. ఇప్పుడిదే వేషంలో ప్రియమణి కనిపించనుందని సమాచారం. అంతేకాదు.. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ రీమేక్ ని నిర్మించనున్నారని వినికిడి. మరి.. చాన్నాళ్ళ తరువాత ప్రియమణి చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ.. ఆ కేటగిరిలో ఆమెకి సాలిడ్ హిట్ ని అందిస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన `నారప్ప`, `విరాట పర్వం` చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాల్లోనూ పొంతన లేని భూమికల్లో కనిపించనుంది ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రస్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



