ఇది విలువ కట్టలేని కౌగిలింత!
on Jan 22, 2021
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒకరినొకరు గట్టిగా కౌగలించుకున్నారు. ఆ కౌగిలింత వెనుక ఉన్న ఎమోషన్‌ను ఎవరు విలువ కట్టగలరు! అవును. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న విజయం ఇవాళ దక్కితే ఆ ఆనందానుభూతిని వర్ణించడానికి ఎవరికి సాధ్యమవుతుంది! అలాంటి అనుభూతినే ఆ ఇద్దరూ పొందారు. అందుకే ఆ కౌగిలింత. శుక్రవారం ఒకరినొకరు ఆత్మీయంగా, ఆప్యాయంగా, స్నేహంగా రవితేజ, గోపీచంద్ వాటేసుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు, పరస్పరం థాంక్స్ చెప్పుకున్నారు. అలాంటి క్షణాలను వారి జీవితాల్లోకి తీసుకొచ్చింది 'క్రాక్' ఫిల్మ్.
రవితేజను పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పోతరాజు వీరశంకర్‌గా చూపిస్తూ గోపీచంద్ మలినేని రూపొందించిన 'క్రాక్' మూవీ జనవరి 9న విడుదలై 50 శాతం ఆక్యుపెన్సీలోనూ రూ. 30 కోట్ల షేర్ మార్క్‌ను దాటేసి, త్వరలోనే రూ. 40 కోట్ల మార్క్‌ను చేరుకొనేందుకు దౌడు తీస్తోంది. 'రాజా ది గ్రేట్' మూవీ తర్వాత రూ. 30 కోట్ల షేర్‌ను సాధించిన రవితేజ సినిమా ఇదే. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా బాక్సాఫీస్ దగ్గర పలాయనం చిత్తగిస్తూ వస్తే, ఆ బాధ ఎలా ఉంటుంది? ఓటమిని అంగీకరించని రవితేజ ఆ బాధను మనసులో అదిమిపెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ బాధ స్థానంలో అనిర్వచనీయమైన ఆనందం వెల్లివిరుస్తోంది. అందుకే ఆ అనుభూతినీ, అనుభవాన్నీ తనకిచ్చిన గోపీచంద్‌కు బిగ్ హగ్ ఇచ్చాడు.
మరి గోపీచంద్ పరిస్థితేమిటి? రవితేజతోటే తీసిన 'బలుపు' (2013) తర్వాత విజయం కోసం అతను ఏడేళ్లుగా ఎదురుచూశాడు. ఈ మధ్యలో అతను తీసింది రెండే సినిమాలు కావచ్చు. అవి 'పండగ చేస్కో', 'విన్నర్' కావచ్చు. ఆ రెండు సినిమాలతో అతను పండగ చేస్కోలేకపోయాడు, విన్నర్ కాలేకపోయాడు. తనకు 'డాన్ శీను', 'బలుపు' రూపాల్లో రెండు హిట్లు రావడానికి కారకుడైన హీరోతో ఇన్నాళ్లకు మూడో సినిమా తీసి, అది మునుపటి సినిమాలకు మించిన హిట్టయితే ఆ ఆనందం ఎలా ఉంటుంది! ఏడేళ్లకు పైగా వేచి చూస్తున్న విజయం దక్కితే ఆ విజయానుభూతి ఎలా ఉంటుంది! అందుకే తన రవితేజను, తన హ్యాట్రిక్ హీరోను బిగియార కౌగలించుకొని ఆనందబాష్పాలు రాల్చాడు.
శుక్రవారం నుంచి 'క్రాక్' ఆడుతున్న థియేటర్లు మరిన్ని పెరిగాయి. మూడో వారంలో అడుగుపెడుతున్న సందర్భంలో థియేటర్ల సంఖ్య పెరగడం చిన్న విషయం ఏమీ కాదు కదా.. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ రంగంలోకి అడుగు పెట్టడం లేదు. సో.. 'క్రాక్' కలెక్షన్లకు ఇప్పట్లో అడ్డు ఉండదన్న మాటే!!