ఓటీటీలో చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మా ఊరి పొలిమేర’.. ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ‘పొలిమేర 2’తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. చేతబడి, క్షుద్రపూజలు, ఊహించని మలుపులతో సాగిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ సిరీస్ నుంచి ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. అయితే ఈసారి కథను మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఏకంగా నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి సందర్భంగా వచ్చిన ఈ గ్లింప్స్‌లో ఆయన ‘విరావి’ అనే శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించారు. పాడుబడిన ఆలయంలోని చీకటి ప్రదేశాలు, అమావాస్య వాతావరణం, విష్ణుమూర్తి నుంచి పరమశివుడికి మారే దృశ్యాలు, అనంత పద్మనాభస్వామి దర్శనంతో గ్లింప్స్ ఆసక్తికరంగా మొదలవుతుంది.
ఆ తర్వాత కొమరయ్య పాత్రలో సత్యం రాజేశ్ క్షుద్రపూజలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో చేతిలో పదునైన కత్తి పట్టుకుని, గంభీరమైన యోధుడి వేషధారణలో అర్జున్ సర్జా ఎంట్రీ ఇస్తారు. ఆయన లుక్, హావభావాలు పాత్రపై ఆసక్తిని పెంచుతున్నాయి. కొమరయ్య చేసే క్షుద్రపూజలకు అడ్డుకట్ట వేసే వ్యక్తిగా విరావి కనిపించబోతున్నాడనే సంకేతాలు గ్లింప్స్‌లో కనిపిస్తున్నాయి.
ఈ సినిమాకు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి రెండు భాగాలకు కూడా ఆయనే దర్శకత్వం వహించగా.. మూడో భాగానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వంశీ నందిపాటి, భరత్ నారంగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కృష్ణ ప్రసాద్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. సత్యం రాజేశ్‌తో పాటు బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు తమ పాత పాత్రల్లోనే కనిపించనున్నారు. ఇటీవల ‘బ్లాస్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్జున్ సర్జా.. ఇప్పుడు ఈ మిస్టిక్ థ్రిల్లర్‌లో భాగం కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు చేరువైన ‘పొలిమేర’ ఫ్రాంచైజీని ఈసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సిరీస్‌ను మరింత విస్తృతమైన ప్రేక్షకులకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొమరయ్యగా సత్యం రాజేశ్, విరావిగా అర్జున్ సర్జా మధ్య ఎలాంటి పోరు ఉండబోతోంది? ఈ ఇద్దరి పాత్రల చుట్టూ కథ ఎలాంటి మలుపులు తిరగనుంది? అన్న ఆసక్తి తాజా గ్లింప్స్‌తో పెరిగింది. సినిమా విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
[Polimera 3, Arjun Sarja, Satyam Rajesh, Polimera 3 Glimpse, Viraavi Character, Komaraiah, Dr Anil Vishwanath, Kamakshi Bhaskarla, Baladitya, Getup Srinu, Rakendu Mouli, Telugu Mystic Thriller, Polimera 3 Pan India Release]






