Home

»

Latest News

టాలీవుడ్‌కు ఐబొమ్మ బిగ్ షాక్.. పైరసీ భూతం రిటర్న్స్.. హై-క్వాలిటీలో కొత్త సినిమాలు!

May 13, 2026

టాలీవుడ్‌ను దశాబ్ద కాలంగా పీడిస్తున్న పైరసీ భూతం 'ఐబొమ్మ' (iBomma) మళ్ళీ పడగ విప్పింది. ఈ వెబ్‌సైట్ ప్రధాన నిర్వాహకుడు 'ఇమ్మడి రవి' అరెస్టుతో పైరసీకి అడ్డుకట్ట పడిందని భావించిన టాలీవుడ్ నిర్మాతలకు ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. రవి బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే 'ఐబొమ్మ వెబ్‌సైట్' సరికొత్త డొమైన్లతో మళ్ళీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడం పరిశ్రమలో కలకలం రేపుతోంది.

ఐబొమ్మ రిటర్న్స్..
గత ఏడాది నవంబర్‌లో ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, ఐబొమ్మ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పైరసీ అధ్యాయం ముగిసిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ హైకోర్టు ఆయనకు కొన్ని కఠినమైన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రవి బెయిల్ పొంది బయటకు వచ్చిన కొద్ది కాలానికే, ఇప్పుడు మళ్ళీ వెబ్‌సైట్ పునరుద్ధరించబడటమే కాకుండా, ప్రస్తుతం థియేటర్లలో ఉన్న కొత్త సినిమాలు కూడా అందులో హై-క్వాలిటీలో దర్శనమిస్తున్నాయి.

పోలీసులకు డబుల్ ఛాలెంజ్
ఐబొమ్మ నిర్వాహకులు సాంకేతికతను వాడుకోవడంలో ఆరితేరిపోయారు. ఒక డొమైన్‌ను బ్లాక్ చేస్తే, వెంటనే మరో పేరుతో సైట్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. సర్వర్లు విదేశాల నుంచి ఆపరేట్ అవుతుండటం వల్ల వీటిని శాశ్వతంగా అరికట్టడం సవాలుగా మారింది. రవి బెయిల్‌పై వచ్చిన తర్వాతే ఈ సైట్ మళ్ళీ యాక్టివ్ అవ్వడం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

పరిశ్రమ మనుగడకే ముప్పు
ఓ వైపు నిర్మాతలు థియేటర్ల ఆదాయం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఐబొమ్మ వంటి సైట్లు సినిమాలను ఉచితంగా అందించడం వల్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారు. ఈ పైరసీ ముప్పు టాలీవుడ్ పునాదులను కదిలిస్తోంది. పోలీసులు, ప్రభుత్వం, సినీ పెద్దలు ఈ డిజిటల్ మాఫియాపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.

ఐబొమ్మ వంటి అక్రమ సైట్లను ప్రేక్షకులు ప్రోత్సహించకూడదని ఫిల్మ్ ఇండస్ట్రీ కోరుతోంది. పైరసీ సైట్లను ప్రోత్సహించడం వల్ల వేల సంఖ్యలో ఉన్న సినీ కార్మికుల పొట్ట కొట్టినట్లవుతుందనే విషయాన్ని గుర్తించాలని వారు కోరుతున్నారు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com