తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని సూపర్ స్టార్‌గా, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న రజనీకాంత్.. తన వ్యక్తిత్వంలో ఉండే నిరాడంబరతకు పెట్టింది పేరు. వెండితెరపై స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రజనీ, నిజ జీవితంలో మాత్రం చాలా సామాన్యంగా ఉంటారు. తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తలైవా, తన జీవితంలోని ఒక అపురూపమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే రజనీకాంత్, గతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమానికి వెళ్ళినప్పటి ఒక ఆసక్తికర సంఘటనను వివరించారు. అక్కడ తన స్టార్‌డమ్ ఏమాత్రం పని చేయలేదని, అసలు తనను ఎవరూ గుర్తుపట్టలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. కేవలం రెండు రోజులు గడపాలని వెళ్ళిన రజనీ, అక్కడి ప్రశాంతతకు ముగ్ధుడై ఏకంగా 15 రోజులు అక్కడే ఉండిపోయారట. ఆశ్రమంలోని ప్రకృతి, జంతువుల మధ్య గడపడం తనకెంతో నచ్చిందని ఆయన పేర్కొన్నారు.
అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఒకరోజు గురుదేవ్‌తో కలిసి ఆశ్రమంలో నడుస్తున్నప్పుడు, అక్కడ ఉన్న వందలాది మందిలో ఒక్కరు కూడా రజనీ వైపు కన్నెత్తి చూడలేదట. వారిలో చాలా మంది తమిళనాడు వాసులే ఉన్నప్పటికీ, రజనీకాంత్ అనే సూపర్ స్టార్ అక్కడ ఉన్నారన్న స్పృహ కూడా ఎవరిలోనూ కనిపించలేదట. ఆ సమయంలో తన అహం ఒక్కసారిగా అణచివేయబడిందని, ఆధ్యాత్మిక శక్తి ముందు ఈ కీర్తి ప్రతిష్టలు ఎంత చిన్నవో తనకు అర్థమైందని రజనీ ఎంతో వినమ్రంగా చెప్పారు.
సినిమా రంగంలో స్టార్‌డమ్ అనేది తాత్కాలికమని, కానీ ఆధ్యాత్మికంగా సంపాదించుకునే గౌరవం శాశ్వతమని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. మరణం తర్వాత కూడా పెరిగేది కేవలం ఆధ్యాత్మిక స్టార్‌డమ్ మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. రజనీకాంత్ తరచుగా హిమాలయాలకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. తన ప్రతి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు చేసి రీఛార్జ్ అవుతుంటారు.





