పెదకాపు - 1 మూవీ రివ్యూ
on Sep 29, 2023
మూవీ : పెదకాపు - 1
నటీనటులు: విరాట్‌కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావురమేష్, నాగబాబు, అనసూయ, రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, తనికెళ్ళ భరణి తదితరులు
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
సంగీతం: మిక్కీ జె.మేయర్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
బ్యానర్ : ద్వారకా క్రియేషన్స్
విడుదల తేదీ: 29 సెప్టెంబర్, 2023
సినిమా అనేది ప్రేక్షకుల్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేసే మీడియా. దాని ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకున్నారు? మంచిని ప్రభోదించి ఉద్దరిద్దామనుకున్నారా? కేవలం వినోదం కోసం మాత్రమే సినిమా తీశారా? లేక ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమా తీసేసి నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు పెట్టేసి.. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని కామెడీ సీన్స్ పెట్టేసి జనాన్ని థియేటర్స్‌కి రప్పించి సొమ్ము చేసుకుందామనుకున్నారా? ఒక సినిమా తీశారంటే పైన చెప్పిన కారణాల్లో ఏదో ఒకటి ఉండాలి కదా! అలాంటిదేమీ లేకుండా కేవలం తమ పైత్యాన్ని జనం మీద రుద్దాలని ప్రయత్నిస్తూ వారి టైమ్‌ను, డబ్బును వృధా చేస్తున్నారు కొందరు సినీ ఉన్మాదులు. ఈమధ్యకాలంలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఎన్ని విజయం సాధిస్తున్నాయి? ఎన్ని ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నాయి? మనం చూస్తూనే ఉన్నాం. మన నిర్మాతలకు, దర్శకులకు ఎన్ని గుణపాఠాలు జరిగినా తమ ధోరణి మార్చుకోకపోవడం గమనార్హం. అలా ఏ లక్ష్యం లేకుండా చేసిన సినిమా ‘పెదకాపు 1’.సెన్సిబుల్ సినిమాలతో తన కెరీర్‌ని లీడ్ చేస్తూ వస్తున్న శ్రీకాంత్ అడ్డాల ఈసారి తన పంథాని మార్చి యాక్షన్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి కథ కంటే కత్తులకే ఎక్కువ పని చెప్పాడు.
కథ:
అసలు ఈ సినిమాలో కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 1962 ప్రాంతంలో లంక గ్రామాల్లో చెలరేగిన హింసా కాండ వల్ల తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన జనం తలో దిక్కుకు పరుగులు తీశారు. ఆ సమయంలో అప్పుడే పుట్టిన పాపను ఎవరో అనాధగా వదిలేస్తే ఆ బిడ్డను ఒక అమ్మాయి ఆ ఊర్లోని ఓ మాస్టారు(తనికెళ్ళ భరణి)కి ఇస్తుంది. కట్ చేస్తే.. 1980లో కథ మొదలవుతుంది. సత్య రంగయ్య(రావు రమేష్), బయ్యన్న(నరేన్) తమ హింసా కార్యకలాపాలతో ఈ ఊరి జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ అధికారం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. పెదకాపు(విరాట్ కర్ణ) తన అనయ్యతో కలిసి సత్య రంగయ్య దగ్గర పనిచేస్తుంటారు. ఒక హత్యా నేరంపై పెదకాపు అన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పటి నుంచి అతను కనిపించకుండా పోతాడు. అతను అదృశ్యం అవడం వెనుక ఎవరి హస్తం ఉంది? మాస్టారు పెంచుకుంటున్న పాప ఎవరు? రాజకీయ లబ్ది కోసం సత్యరంగయ్య, బయ్యన్న చేసే కార్యకలాపాల వల్ల ఆ ఊరిలో ఎలాంటి వాతావరణం నెలకొంది. హింసా రాజకీయాల నుండి ఆ గ్రామాన్ని ఎవరు కాపాడారు? ఈ కథలో ఆ ఊరి ప్రధాన నాయకులే కాకుండా కన్నబాబు(శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ(అనసూయ) కూడా ఉంటారు. వారు ఈ కథను ఎలా మలుపు తిప్పారు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
అసలు ఈ కథ ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? అనేది సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా అర్థం కాదు. ఏ క్యారెక్టర్‌కీ పూర్తి న్యాయం చెయ్యకుండా ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఏ సీన్ ఎందుకు వస్తుందో, ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకునేలోపు మరో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇలా సినిమా ప్రారంభం నుంచి ఎండిరగ్ వరకు ఉంటుంది. ఈ సినిమాలో కేవలం హింసనే హైలైట్ చేశాడు తప్ప కథని గానీ, కథలోని క్యారెక్టర్లని అస్సలు పట్టించుకోలేదు. ఒక దశలో ప్రేక్షకుడు అయోమయంలో పడిపోయి ఏం జరుగుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామన్నా కుదరదు. ఎమోషన్‌గానీ, సెంటిమెంట్‌గానీ ఎక్కడా వర్కవుట్ అవ్వలేదు. అసురన్ రీమేక్‌గా శ్రీకాంత్ అడ్డాల చేసిన నారప్ప చిత్రాన్నే దృష్టిలో ఉంచుకొని ఈ కథ రాసుకున్నట్టు అర్థమవుతుంది. ఆ సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి హింసను ప్రధానంగా చూపిస్తే ఈ సినిమాతో హిట్ కొట్టొచ్చు అనే ధోరణితో ఈ సినిమా చేసేశాడు. ఎలాంటి ప్రత్యేకత లేని ఒక రొటీన్ కథను తీసుకొని దానికి అతి భయానకమైన హింసను జోడిరచి ప్రేక్షకుల్ని మెప్పించాలని చూసిన శ్రీకాంత్ అడ్డాలకు చేదు అనుభవమే ఎదురైంది. ఈ కథనుగానీ, కథనాన్నిగానీ విశ్లేషించడం అనవసరమని సినిమా చూస్తే అర్థమవుతుంది.
నటీనటులు:
ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ పెర్‌ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమాలో నటన కంటే యాక్షన్ సీన్సే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతనికి అంత గుర్తింపు రాలేదు. ఇక అక్కమ్మగా నటించిన అనసూయ తన క్యారెక్టర్‌కి న్యాయం చేసే ప్రయత్నం చేసింది. రావు రమేష్, నరేన్, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, నాగబాబు ఎప్పటిలాగే తమ క్యారెక్టర్ల పరిధి మేరకు బాగానే చేశారు. హీరోయిన్ క్యారెక్టర్‌ని తన గత సినిమాల్లో మాదిగానే కొంచెం ఓవర్ యాక్టివ్‌గా చూపించాలని ట్రై చేశాడు శ్రీకాంత్. కానీ, అదేమంత వర్కవుట్ అవ్వలేదు. అయితే హీరోయిన్‌గా ప్రగతి ఫర్వాలేదు అనిపించింది. ఇందులో శ్రీకాంత్ అడ్డాల ఒక కీలకమైన పాత్ర చేశాడు. నటన పరంగా ఓకే అనిపించుకున్నా దానికి కూడా అంత ప్రాముఖ్యం లేదు.
సాంకేతిక నిపుణులు:
సినిమాకి ఎంతో కొంత ప్లస్ అయిందీ అంటే అది ఫోటోగ్రఫీ. చోటా కె.నాయుడు ఒక డిఫరెంట్ ప్యాట్రన్‌లో సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. మిక్కీ జె. మేయర్ అందించిన సంగీతం ఏ దశలోనూ ఆకట్టుకోదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో ఏమాత్రం కేర్ తీసుకోలేదని అర్థమవుతుంది. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. ఇక డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి చెప్పాలంటే.. పసలేని కథతో అద్భుతం సృష్టించాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ దశలోనూ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ కలిగించడంలో విఫలమయ్యాడు. కేవలం హింసే ప్రధానంగా అనుకొని అతను చేసిన ఈ సినిమా అతని కెరీర్‌లో మరో పరాజయంగా చెప్పుకోవచ్చు.
తెలుగు వన్ పర్‌స్పెక్టివ్:
ఈమధ్యకాలంలో దర్శకులు హింసను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అలా శ్రీకాంత్ అడ్డాల తనకు సంబంధం లేని జోనర్‌లోకి ఎంటర్ అయి ప్రతి పది నిమిషాలకు ఒక వయొలెంట్ సీన్‌తో భయపెట్టే ప్రయత్నం చేశాడు. యాక్షన్ సీన్స్ మీద పెట్టిన శ్రద్ధ కథ, కథనం, క్యారెక్టరైజేషన్స్ మీద పెట్ట లేదు. దాంతో ప్రేక్షకులు అయోమయంలో పడిపోయారు. ఒక దశలో సినిమాలో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవడం ఆడియన్స్‌కి కష్టంగా మారిపోయింది. ఏ సీన్‌కి ఆ సీన్ అన్నట్టుగా తీశాడు తప్ప కథలో ఫ్లో ఉండాలి, ఒక సీన్‌కి మరొక సీన్‌కి కనెక్టివిటీ ఉండాలి అని ఆలోచించలేదు. పెదకాపు అనే టైటిల్ చూసిన తర్వాత ఇదేదో కులాల కుమ్ములాట అనుకొనే ఆడియన్స్‌కి అది హీరో పేరు అని తెలిసి కంగు తిన్నారు. మొదటి పార్టుతోనే ఆడియన్స్‌ని అదరగొట్టిన శ్రీకాంత్ రెండో పార్టులో ఇంకెన్ని దారుణాలు చూపిస్తాడో మరి.
రేటింగ్: 2/5
- జి.హరా

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
