అరుదైన ఘనత సాధించిన నందమూరి బాలకృష్ణను అభినందించిన పవన్‌కళ్యాణ్!
on Aug 25, 2025
1974లో ‘తాతమ్మకల’ చిత్రంతో నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ.. 50 ఏళ్ళుగా తన అసమాన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమాకి అందిస్తున్న సేవకుగాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో బాలకృష్ణకు స్థానం లభించింది. ఆయన ఈ స్థాయికి రావడం వెనుక తండ్రి నటరత్న ఎన్.టి.రామారావు నుంచి వారసత్వంగా వచ్చిన క్రమశిక్షణ, కృషి, పట్టుదల ఉన్నాయి. సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో, సామాజిక సేవ విషయంలో అంకిత భావంతో పనిచేసే బాలకృష్ణకు ప్రపంచ స్థాయి గౌరవం లభించడం తెలుగు వారంతా గర్వించదగిన విషయం. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఎ.పి. డిప్యూటీ సి.ఎం. పవన్‌కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ నందమూరి బాలకృష్ణకు తన అభినందనలు తెలియజేశారు. ‘బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్)లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం ఎమ్మెల్యే, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణగారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేసారు. పవర్‌స్టార్ చేసిన ఈ సూపర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. తమ అభిమాన హీరో సాధించిన అరుదైన గౌరవానికి అభినందనలు తెలియజేస్తూ పవన్‌కళ్యాణ్ చేసిన ట్వీట్‌కు పవర్‌స్టార్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అభిమానులు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



