పండుగ సాయన్న పాత్రలో పవన్ కల్యాణ్!
on Jul 9, 2020
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'వకీల్ సాబ్' మూవీని ఈ ఏడాది ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత దిల్ రాజు తపిస్తున్నా పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే సెట్స్‌పైకి వెళ్లాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నాడు. ఆయనకు సంబంధించి మరో రెండు వారాల షెడ్యూల్ మిగిలి ఉంది.
'వకీల్ సాబ్'తో పాటు మరో సినిమానీ పీకే చేస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 19వ శతాబ్దం ద్వితీయార్ధం నేపథ్యంలో నడుస్తుంది. ప్రచారంలో ఉన్న దాని ప్రకారం తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుపొందిన పండుగ సాయన్న కథ ఈ సినిమాకు ఆధారం. మహబూబ్‌నగర్ దగ్గర్లోని మెరుగోని గ్రామ వాస్తవ్యుడైన సాయన్న భూస్వాములను దోచుకొని పేదలకు పంచిపెట్టేవాడుగా చరిత్ర చెబుతోంది. ఆయనపై బెక్కం జనార్దన్ రాసిన నవల ఆధారంగా ఇప్పటికే క్రిష్ ఈ సినిమా స్క్రిప్టును పూర్తి చేసినప్పటికీ, సాయన్న వంశస్తులను కలుసుకోవాలని క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, వారి నోటి వెంట సాయన్న వీరగాథలను వినాలని కూడా ఆయన ఆశిస్తున్నాడు.
త్వరలోనే క్రిష్ మెరుగోనికి వెళ్లే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. సాయన్న క్యారెక్టర్‌కు పవన్ కల్యాణ్ ఏ రీతిలో న్యాయం చేస్తాడో చూడాలి. ఈ సినిమా కోసం 'విరూపాక్ష', 'వారాహి' అనే టైటిల్స్‌ను ఇప్పటికే రిజిస్టర్ చేశారు. సూర్యా మూవీస్ అధినేత ఎ.ఎం. రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు.